కరోనా మరణం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా?

Update: 2020-03-21 07:40 GMT
కరోనా ప్రపంచాన్ని కబళిస్తోంది. చాలా మందిని బలితీసుకుంది. దాదాపు 10వేల మందికి పైగా ఇప్పటికే చనిపోయారు. అయితే చనిపోయిన వ్యక్తి శరీరంలో ఉన్న కరోనా వైరస్ ను బయటకు రాకుండా చేయడం వైద్యులకు చాలా కష్టంతో కూడుకున్న పని.

ఇప్పుడు కరోనా మరణాలు చైనా కంటే దారుణంగా ఇటలీలో చోటుచేసుకుంటున్నాయి.  ఇప్పటిదాకా చైనాలో 3249మంది చనిపోగా.. ఇటలీలో ఏకంగా 3405కు సంఖ్య పెరిగింది.

ప్రధానంగా ఉత్తర ఇటలీలోని మిలాన్ సిటీని కరోనా అతలాకుతలం చేసింది. గ్లోబల్ ఫ్యాషన్, ఫైనాన్స్ రంగాలకు హబ్ గా పేరొందిన మిలాన్ ఇప్పుడు కరోనా సోకడంతో భయానకంగా తయారైంది. ఆస్పత్రుల్లో వందలసంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నారు. వందలాది మంది చనిపోతున్నారు.

శ్వాస తీసుకోరాక బుడగల హెల్మెట్లు రోగులు వాడుతున్నారు. వారి శ్వాస ఆగిపోతున్న వీడియోలు అందరినీ కన్నీరు పెడుతున్నాయి. ఇంతటి భయానక వాతావరణం ఇటలీలో తామెప్పుడు చూడలేదని వైద్యులు వాపోతున్నారు.

వైరస్ పుట్టిన చైనాలో మరణాలు దాదాపు ఆగిపోయి సాధారణ స్థితికి వచ్చింది. కాగా ఇటలీలో మాత్రం మృత్యువు మరింత కరాళనృత్యం చేస్తోంది.  మొన్న ఒక్కరోజే  దేశవ్యాప్తంగా సుమారు 500 మంది చనిపోయారు. మొత్తంగా గురువారం నాటికి 3405 మంది కన్నుమూశారు.

ఒక్కసారిగా మరణాల సంఖ్య పెరగడంతో దేశంలోని స్మశాన వాటికల వద్ద రద్దీ ఏర్పడింది. ఒక్కో స్మశానంలో రోజుకు కనీసం 24మందిని ఖననం చేస్తున్నట్టు సమాచారం. డాక్టర్లతోపాటు కాటికాపరులు సైతం ఇటలీలో కంటి మీద కునుకులేకుండా పనిచేస్తున్నారు. ఇటలీలో మరిన్ని వేల చావులు ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. మరణించిన వారి నుంచి కరోనా బయటపడకుండా వారిని పూర్తిగా క్లోరిన్ ద్రావణంతో నింపేసి ఖననం చేస్తున్నారు.
Tags:    

Similar News