దేశం కొత్త పార్టీని కోరుకుంటోందా?

Update: 2019-10-29 04:12 GMT
వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో రఫ్ఫాడించిన బీజేపీ మొన్న మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు సరిపడా సీట్లు సాధించలేకపోయింది. అంతేకాదు.. ఇదే సమయంలో 17 రాష్ట్రల్లో జరిగిన 51 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేకపోయింది. కానీ, అయిదు నెలల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అద్భుత విజయాలు అందుకుంది. కానీ, ఆ ఎన్నికలకు ముందు, తరువాత జరిగిన రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అలా అని బీజేపీ ప్రభావం చూపించలేని చోట కాంగ్రెస్సేమీ అద్భుతాలు సాధించలేదు. ఆ పార్టీకూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో చచ్చీచెడి అధికారం అందుకుంది. మహారాష్ట్ర, హరియాణాల్లో ఆ ఆశలూ లేకపోయాయి. మరి, ప్రాంతీయ పార్టీలు ఏమైనా రాజ్యమేలుతున్నాయా అంటే అదీ లేదు. దక్షిణాదిలో, తూర్పున ఒకట్రెండు రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా ఆ పరిస్థితి లేదు. అలా అని ఆ పార్టీలకు పొరుగు రాష్ట్రాల్లో ఆదరణ ఉందా అంటే అలాంటి పరిస్థితీ కనిపించడం లేదు.

    మరి... జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా పూర్తి స్థాయి ప్రభావం చూపించలేకపోతుందంటే దానర్థం ఏమిటి?

    ఉన్న పార్టీలను దేశ ప్రజలు సంపూర్ణంగా కోరుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీల గుర్తింపు ఉన్నవి.. పలు రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్నవి పార్టీలు కొన్ని ఉన్నప్పటికీ వాటి పరిస్థితీ ఏమంత బాగులేదు. సీపీఎం, సీపీఐలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. సమాజ్‌వాది పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వంటివాటికి జాతీయ  హోదా ఉన్నప్పటికీ ఆ హోదా కోసమే అవి తమకు పట్టున్న రాష్ట్రాల్లో కాకుండా ఇతరత్రా అక్కడా ఇక్కడా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పార్టీల సహకారంతో ఒకట్రెండు సీట్లు గెలిచి జాతీయ పార్టీ హోదాను నిలబెట్టుకుంటున్నాయి. అంతేకానీ.. వాటికీ పాన్ ఇండియా ప్రెజెన్స్ లేనేలేదు.

    పెద్ద పార్టీలకూ దేశవ్యాప్త ఆమోదం లేక... ఇతర పార్టీలను ప్రజలు ఆదరించక.. ఇంకేం  కోరుకుంటున్నారంటే కచ్చితంగా మార్పు కోరుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఆ మార్పు ఎలా ఉండాలి అంటే ప్రభావవంతంగా ఉండాలి. ఒక నాయకుడి రూపంలో ఉండాలి. 2014కి కొద్ది రోజుల ముందు నుంచి దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఒక ఊపు తెచ్చి అధికారంలోకి వచ్చిన మోదీలా... అంతకుముందు దేశవ్యాప్తంగా యువత, మేధావులు, సంస్కరణాభిలాషులు.. ఇలా అనేక వర్గాలను ఆకట్టుకున్న రాజీవ్ గాంధీలా దేశవ్యాప్తంగా ఛరిష్మా ఉన్న వ్యక్తి నేతృత్వంలోనో.. లేదంటే పూర్తిగా ఆచరణాత్మకంగా, ఆకర్షణీయంగా, ఆశలు రేపేదిగా ఉండే అనూహ్యమైన కొత్త నినాదం ఎత్తుకునే నాయకుడి ఆధ్వర్యంలోనో కొత్త పార్టీ కానీ పురుడు పోసుకుంటే దేశ ప్రజలు ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News