స్లోగన్ ముందు 85 నినాదాలు ఓడిపోయాయి!

Update: 2016-11-09 09:19 GMT
ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్ - క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయినా మరేదైనా సరే తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు క్రియేట్ చేసిన ఉత్కంఠ ముందు తక్కువనే చెప్పాలి. అత్యంత రసవత్తరంగా - ఎవ్వరూ ఊహించని రీతిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేత సౌధంలో అడుగు పెట్టడానికి అర్హత సంపాదించగా.. సర్వేలు - ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారవుతూ హిల్లరీ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సాగించిన ఎన్నికల ప్రచారంపై చర్చ జరుగుతోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు మొదలైనప్పటినుంచి హిల్లరీ తన ప్రచారంలో సుమారు 85 నినాదాలు వినిపించగా... ట్రంప్‌ కేవలం "మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌" అనే ఒకే ఒక్క స్లోగన్‌ తో ప్రచారం చేశారు. ఇప్పటికే అమెరికా చాలా గ్రేట్... ఇంకా ట్రంప్ కొత్తగా చేసే గ్రేట్ ఏమిటి అంటూ ఒబామా వంటివారు ఈ స్లోగన్ పై సెటైర్స్ కూడా వేశారు. అయినా సరే అదొక్క స్లోగన్ తోనే ట్రంప్ ప్రచారం చేశారు. తనపై ఎన్ని వ్యక్తిగత ఆరోపణలు వచ్చినా ట్రంప్‌ జాతీయ భావాన్ని మాత్రమే తన ప్రచారంలో వినిపించారు. ఈ క్రమంలో పలువురు మహిళలు అతనిపై లైంగిక వేదింపులకు సంబందించిన ఆరోపణలు చేసినా, మరెన్నో వ్యక్తిగత అంశాలపై విమర్శించినా... అమెరికన్స్ ఆ విషయాలను లైట్ తీసుకున్నారనే అనుకోవాలి!

అయితే హిల్లరీ మాత్రం అనేక అంశాలను స్పృశించినా ఏ విషయంలోనూ కచ్చితమైన భరోసా ఇవ్వలేకపోయారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై గట్టిగా గళం వినిపించడంలో హిల్లరీ ఫెయిలయ్యారనే చెప్పుకోవాలి. మరోవైపు ఈమెయిస్ వ్యవహారం కూడా హిల్లరీకి గట్టిదెబ్బనే తగిలించింది. ఏదిఏమైనా... హిల్లరీ ఓటమికి ఎన్నికారణాలు అనే విషయం కాసేపు పక్కనపెడితే... ట్రంప్ గెలుపుకు మాత్రం ఆ ఒక్క స్లోగనే కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News