బ్యాంక్ ఉద్యోగులను పెళ్లి చేసుకోవద్దని ఫత్వా

Update: 2018-01-04 13:29 GMT
ముస్లిం సంస్థ‌ల వివాదాస్ప‌ద ఫ‌త్వాల జాబితాలో మ‌రోటి చేరింది. ఇస్లాం మత సంస్థల జారీ చేసే ఫత్వాలు ఇలాగే వింతగా ఉంటాయనే భావ‌న క‌లిగించేలా తాజాగా మ‌రో ఆదేశం వెలువ‌డింది. యూపీకి చెందిన దారుల్ ఉలూమ్ దేవ్‌ బంద్ ముస్లింలకు ఓ ఫత్వా జారీ చేసింది. అదేంటంటే.. అక్రమంగా డబ్బు సంపాదించే బ్యాంక్ ఉద్యోగులను పెళ్లి చేసుకోవద్దనీ, మంచి కుటుంబాన్ని చూసి పెళ్లి చేసుకోవాలని ఆ ఫత్వాలో ఆదేశించింది. ఇంత‌కీ ఆ ఆక్ర‌మ సంపాద‌న ఏంట‌య్య అంటే బ్యాంక్ ఉద్యోగం.

తనకు ఓ పెళ్లి సంబంధం వచ్చిందని, ఆ అమ్మాయి తండ్రి బ్యాంకు ఉద్యోగి అని.. అలాంటప్పుడు ఈ సంబంధం కలుపుకోవచ్చా అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు దారుల్ ఉలూమ్ ఫత్వా సెక్షన్ ఇలా స్పందించింది. `అలాంటి కుటుంబం కచ్చితంగా అక్రమంగా సంపాదిస్తుందని - అలాంటి కుటుంబాలతో సంబంధం కలుపుకోవడం సరైనదా?` అంటూ ఎదురు ప్రశ్నించింది. `అసలు అలాంటి వాళ్లను పెళ్లి చేసుకోవద్దు. ఇలా అక్రమంగా సంపాదించిన కుటుంబాలకు గౌరవం - విలువలు ఉండవు. ఓ ధర్మబద్ధమైన కుటుంబాన్ని చూసి పెళ్లి చేసుకో` అంటూ ఆ యువకుడికి దారుల్ ఉలూమ్ సూచించింది.

ఇదిలాఉండ‌గా...డబ్బును అమ్ముకోవడం అనేది ముస్లిం చట్టమైన షరియత్ ప్రకారం నిషిద్ధం. డబ్బుకు విలువ ఉండదని, దానిని లాభానికి అమ్ముకోకుండా కేవలం వాడుకోవాలని షరియత్ చెబుతున్నది. సాధారణంగా ఇస్లామిక్ బ్యాంకులు.. వడ్డీ లేని బ్యాంకింగ్ అన్న సూత్రంపై పనిచేస్తాయి. చాలా వరకు ఇస్లామిక్ దేశాల్లో ఈ బ్యాంకులు ఉన్నాయి. కొన్ని నాన్ ఇస్లామిక్ దేశాల్లో ఇప్పుడు బ్యాంకుల్లో ఇస్లామిక్ విండోలు తెరుస్తున్నారు.
Tags:    

Similar News