పొలార్డ్ బ్యాటెత్తి అతణ్ని బాదబోయాడు

Update: 2016-05-22 11:03 GMT
క్రికెట్లో వెస్టిండీస్ ఆటగాళ్లకు మంచి ఎంటర్టైనర్స్ ఇంకెవరూ ఉండరు. తమ ఆటతో.. ప్రవర్తనతో ఎప్పుడూ జనాల్ని ఖుషీ చేస్తుంటారు ఆ జట్టు ఆటగాళ్లు. అప్పుడప్పుడూ మైదానంలో గొడవలతోనూ వాళ్లు వార్తల్లో నిలుస్తుంటారు. తమ దేశ క్రికెట్ బోర్డుతో గొడవల నేపథ్యంలో రెండు వర్గాలుగా చీలిపోయిన క్రికెటర్లు ఐపీఎల్లో సైతం ఆ విభేదాల్ని కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్-గుజరాత్ లయన్స్ మ్యాచ్ సందర్భంగా ఇద్దరు వెస్టిండీస్ ఆటగాళ్లు మైదానంలో గొడవపడి వార్తలోకి ఎక్కారు. ఆ ఇద్దరూ.. కీరన్ పొలార్డ్-డారెన్ బ్రావో.

ఈ మ్యాచ్ లో ముందు ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ చేసింది. గుజరాత్ బౌలర్ బ్రావో బౌలింగ్ లో బట్లర్ ఔటయ్యాక పొలార్డ్ బ్యాటింగ్ కు వచ్చాడు. బ్రావో పొలార్డ్ బంతి వేసిన అనంతరం ఫాలో త్రూలో భాగంగా ముందుకు వచ్చి పొలార్డ్ భుజాన్ని రాసుకుంటూ వెళ్లాడు. బ్రావో కావాలనే అలా చేయడంతో పొలార్డ్ కు మండిపోయింది. అరుస్తూ అతణ్ని కొట్టడానికి బ్యాటు ఎత్తాడు. బ్రావో కూడా అతణ్ని తిరిగి ఏదో అన్నాడు. తర్వాత నవ్వుతూ వెళ్లిపోయాడు. కొన్ని నిమిషాల పాటు ఈ ఘటనతో మైదానంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమను పక్కనబెట్టి పొలార్డ్ ను మాత్రమే జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం మీద బ్రావో సహా కొందరు క్రికెటర్లు ఆగ్రహంగా ఉన్నారు. దీనిపై పొలార్డ్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేశాడు. ఆ గొడవ నేపథ్యంలోనే మైదానంలో సైతం ఇలా ప్రవర్తించారని అర్థమవుతోంది.

Tags:    

Similar News