రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశామంటే..

Update: 2018-12-04 11:04 GMT
తెలంగాణ లో ఎన్నికల వేడి మరింత రాజుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అగ్ర నేత రేవంత్ రెడ్డి ని మంగళవారం తెల్లవారు జామున అరెస్టు చేయడం వివాదాస్పదమైంది. అంత అత్యవసరంగా.. అదీ తెల్లవారుజామున ఆ సమయంలో రేవంత్ ను అరెస్టు చేయడం ఏంటంటూ.. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. పోలీసుల వైఖరిని నిరసిస్తున్నాయి. ఐతే ఈ అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదని.. ముందు జాగ్రత్త చర్యగానే రేవంత్ ను అరెస్టు చేయించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. రేవంత్ అరెస్టు పై రజత్ కుమార్ మీడియాకు వివరణ ఇచ్చారు.

రేవంత్ నియోజకవర్గం అయిన కొడంగల్ లో కేసీఆర్ సభ పెట్టబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బంద్ కు పిలుపు ఇచ్చిందని.. దీని పై టీఆర్ఎస్ తమకు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదు పై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపామన్నారు. వారి ఆదేశాలతోనే ఆర్వో.. జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాశామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రేవంత్ రెడ్డిని ముందు జాగ్రత్తలో భాగంగానే అరెస్ట్ చేశామన్నారు.

కొడంగల్‌ లో శాంతి భధ్రతల సమస్య ఉందని రజత్ చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తాము అన్ని పార్టీలనూ ఒకేలా చూస్తామని.. తెలంగాణ రాష్ట్రమంతటా ప్రశాంత వాతావరణం ఉండాలని ఆశిస్తున్నామని.. ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీ గా సాగుతున్నాయని చెప్పారు. అన్ని విజ్ఞప్తులనూ పరిశీలిస్తూ.. ఎవరికైనా ప్రచారం చేసుకొనే స్వేచ్ఛ కల్పిస్తామని ఆయన అన్నారు.
Tags:    

Similar News