సుజ‌నా గ్రూప్స్‌ లో ఈడీ సోదాలు

Update: 2018-11-24 07:14 GMT
తెలుగు రాష్ట్రాల్లో సోదాల క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. కేంద్ర మాజీ మంత్రి - టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఇంట్లో - ఆయ‌న‌కు చెందిన‌ సంస్థల్లో ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు తాజాగా దాడులు నిర్వ‌హించారు. గురువారం అర్ధ‌రాత్రి చెన్నై నుంచి హైద‌రాబాద్ చేరుకున్న అధికారుల బృందం నాగార్జున హిల్స్‌ లో గ‌ల బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కంపెనీతోపాటు మ‌రో సంస్థ‌లో సోదాలు నిర్వ‌హించింది.

డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సుజనా చౌదరిపై ఆరోపణలున్నాయి. సుజ‌నా త‌న సంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌ను డైరెక్ట‌ర్‌ లుగా పెట్టి ఈ డొల్ల కంపెనీల‌ను స్థాపించిన‌ట్లు ఫిర్యాదులు అందాయి. ఈ కంపెనీల ద్వారానే గంగా స్టీల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ - భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌ మెంట్ అండ్‌ ట్రేడింగ్ లిమిటెడ్ - తేజస్విని ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ - ఫ్యూచర్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు పెద్దయెత్తున డబ్బు మళ్లించారని ఫిర్యాదుల్లో ఉంది. ఈ ఆరోపణలపై 2016 ఫిబ్రవరిలో సీబీఐ ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేసింది.

ఈ కేసులకు సంబంధించి ఈడీ గ‌త అక్టోబ‌రులో సోదాలు నిర్వహించింది. సుజ‌నా సంస్థ‌ల్లో హార్డ్ డిస్క్‌ లు - ఫైల్స్‌ తోపాటు కీలక డాక్యుమెంట్‌ లను స్వాధీనం చేసుకుంది. తాజా సోదాల్లోనూ ఈడీ ప‌లు కీల‌క ప‌త్రాల‌ను సుజ‌నా ఇంట్లో - ఆయ‌న సంస్థ‌ల్లో స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ. 124 కోట్లు - కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ. 120 కోట్లు - ఆంద్రాబ్యాంక్ నుంచి రూ. 60 కోట్లు రుణాలను సృజన గ్రూప్స్ పొందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ రుణాల్లో చాలా మొత్తాన్ని డొల్ల కంపెనీల‌కు త‌ర‌లించిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి.


Tags:    

Similar News