ఏపీ కేబినెట్ భేటీ.. ఏం తేలిందంటే!

Update: 2019-05-10 04:53 GMT
చంద్రబాబు నాయుడు గతంలో విసిరిన సవాల్ ప్రకారం అయితే ఈ రోజే ఏపీ కేబినెట్ భేటీ జరగాల్సింది. 'పదో తేదీన కేబినెట్ భేటీ.. ఎవరు ఆపుతారో చూస్తాం.. అధికారులు ఎలా రారో చూస్తాం..' అంటూ చంద్రబాబు నాయుడు అప్పుడు  ఛాలెంజ్ చేశారు. అయితే బాబు తన పంతాన్ని నెగ్గించుకోలేకపోయారు.

ఎన్నికల నియామవళికి విరుద్ధంగా ఏపీ కేబినెట్ భేటీ జరగలేదు. అయితే చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గి కేబినెట్ భేటీకి అధికారాలు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ ను కోరారు. మొదట్లోనేమో ప్రగల్బాలు పలికి.. ఆ తర్వాత బాబు వెనక్కు తగ్గడం చర్చనీయాంశం అయ్యింది.

పద్నాలుగో తేదీని కేబినెట్ భేటీకి ముహూర్తంగా ప్రకటించి - ఆ మేరకు  అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కోరింది. అయితే ఈ విషయంలో రొటీన్ గానే తాము నిర్ణయం తీసుకునేది ఏమీలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలని ఏపీ ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వ ముఖ్య అధికారుల నుంచి కేబినెట్ భేటీ విషయంలో వచ్చిన విన్నపాన్ని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం యథాతథంగా ఢిల్లీకి పంపించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో నిర్ణయం తీసుకుని చెప్పాలని కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించే తీరును బట్టి ఏపీలో కేబినెట్ భేటీ జరగడమా - జరగకపోవడమా.. అనేది తేలుతుందని విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News