సేం సీన్‌ : అక్కడ జానా.. ఇక్కడ ఎర్రబెల్లి!

Update: 2015-09-16 04:12 GMT
తెలంగాణ రాజకీయాల్లో విపక్షాల విషయానికి వస్తే ఒక విచిత్రమైన సీన్‌ కనిపిస్తోంది. రెండు పార్టీలోనూ కీలకమైన నాయకులు ఒక తరహాలో.. ఒకే రీతిగా కనిపిస్తున్నారు. ఇంచుమించు ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఒకే రకంగా విమర్శలు సాగిస్తున్నారు. ఒకే రకంగా విమర్శలు ఎదుర్కొంటూ కూడా ఉన్నారు. ఆ ఇద్దరు నాయకులు వేరెవ్వరో కాదు.. కాంగ్రెసులో జానారెడ్డి. తెలుగుదేశంలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు.

యాదృచ్చికమైన మరో అంశం ఏంటంటే.. ఈ ఇద్దరూ కూడా ఆయా పార్టీలకు శాసనసభలో ఫ్లోర్‌ లీడర్లు. అంటే సభలో అంతా వారి కనుసన్నల్లోనే జరగాలన్నమాట. అయితే ఈ ఇద్దరు నాయకులకు కూడా.. ప్రస్తుతం తెరాస అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తప్పడం లేదు. నిజానికి ప్రభుత్వం పట్ల జానారెడ్డి వ్యవహరిస్తున్నంత మెతకగా, ఎర్రబెల్లి వ్యవహరించకపోయినప్పటికీ.. ఆయన కులం ఒక నెగటివ్‌ అంశంగా మారుతోంది. ఇద్దరూ తెరాస లో సత్సంబంధాలు ఉన్నా లేకపోయినా.. విమర్శలను మాత్రం భరిస్తున్నారు.

జానారెడ్డి కాంగ్రెసు పార్టీలో చాలా సీనియర్‌ నాయకుడు. పైగా ప్రస్తుతం రాజకీయాలనుంచి ఇక విరమించుకోవాలని.. తన వారసులు కూడా కొత్తతరంగా దూసుకొచ్చేస్తున్నారని.. ఇక తాను తప్పుకోవాలనే ఆలోచనను చాలాకాలంనుంచి వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి కెరీర్‌ చివరి దశలో పార్టీ పట్ల ఆయన అంకితభావంపై విమర్శలు రావడం బాధాకరం. ఆయన తెరాసఅనుకూలంగా ఉన్నారని, మారిపోయే ఆలోచన ఉన్నదని మధ్య విమర్శలు వచ్చాయి. కనీసం ప్రభుత్వం ప్రాజెక్టులను రీడిజైన్‌ చేయడం మంచిదే అని జానా అన్నా కూడా.. ఆయనకు ఇతర ఉద్దేశ్యాలను అంటగడుతున్నారు.

ఇక్కడ తెదేపాలో మరీ జానా అంతగా కాకపోయినా.. ఎర్రబెల్లి కూడా తెరాస అనుకూలుడనే ముద్ర పడుతోంది. గతంలో తెరాసలో చేరడానికి రాయబారం నడిపి... అది కుదరక పార్టీలో మిగిలిపోయాడనే ముద్ర కూడా ఉంది. ఇలాంటి నీలాపనిందలను తొలగించుకుని ఈ ఇద్దరు నాయకులు పార్టీని ఎలా ముందుకు తీసుకువెళతారో చూడాలి.
Tags:    

Similar News