కేసీఆర్‌ కు రెండు ఓట్లు..అస‌లు నిజం ఇద‌ట‌

Update: 2018-12-10 05:31 GMT
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు చింతమడక - ఎర్రవల్లి రెండు గ్రామాల్లో ఓటు ఎలా ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఏ రేవంత్‌ రెడ్డి నిలదీసిన సంగ‌తి తెలిసిందే. ఒకచోట కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు - మరొచోట చంద్రశేఖర్‌ రావు కల్వకుంట్ల అని ఓటు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఎవరైనా ఓటు కొత్తగా నమోదు చేయించుకోడానికి ఫారం 6 ప్రకారం డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని, తనకు ఎక్కడ ఓటు లేదన్న ప్రమాణ పత్రం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ద్వారా రెండు చోట్లా ఓటు కొనసాగించడం ఎన్నికల లోపభూయిష్ట విధానాలకు నిదర్శనమన్నారు. కేసీఆర్‌ తప్పిదానికి చట్టం ప్రకారం ఏడాది జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. కేసీఆర్‌ మీద ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ రెండు ప్రాంతాల్లో ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

కాగా, రేవంత్‌ రెడ్డి ఆరోప‌ణ‌ల‌పై తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌ రెడ్డి - ఎర్రవల్లి సర్పంచ్ భాగ్య బాల్‌ రాజ్ స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్‌ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆయన చెప్పేవి అబద్ధాలని  అన్నారు. సీఎం కేసీఆర్‌ పై రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలను వారు ఖండించారు. గజ్వేల్‌ లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేరు ఎర్రవల్లి ఓటర్ లిస్టులో నమోదుకాలేదని - అవసరమైతే ఎర్రవల్లికి వచ్చి జాబితాను పరిశీలించుకోవచ్చని సూచించారు. కావాలని అనుమానాలు రేకెత్తించేందుకు రేవంత్‌ రెడ్డి తప్పుడు సమాచారం ప్రజల్లోకి పంపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు సీఎం కేసీఆర్‌ కు అనుకూలంగా ఓట్ల వర్షం కురిపించారని - మళ్లీ టీఆర్‌ ఎస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌ లో భారీ మెజార్టీతో సీఎం కేసీఆర్ గెలుస్తారని స్థానికంగా జరిగిన అభివృద్ధి - సంక్షేమ పథకాలే ప్రజలకు సీఎంపై అభిమానం పెంచాయని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి ప్రజలకు డబ్బు పంచి ఓట్లు కొనుక్కోవాలని ప్రయత్నించారని, గజ్వేల్ ప్రజలు తెలివిమంతులని వారికి ఓటును అమ్ముకునే దుస్థితి పట్టలేదని చెప్పారు. పనిచేసే నాయకుడినే గజ్వేల్ ప్రజలు ఎంచుకుంటారని - సీఎం కేసీఆర్‌ ను భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి మరోసారి అవకాశం పొందుతారని వారు వివరించారు.
Tags:    

Similar News