గురి చూసి కొట్టినట్లు.. సవాలు విసిరి షాకిచ్చిన ఈటల

Update: 2021-08-13 06:32 GMT
చావో రేవో అన్నట్లుగా మారిన వేళ.. మర్యాదల్ని పక్కన పెట్టేయటం తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. తనపై భూకబ్జా ఆరోపణలు చేసి..పేజీల కొద్దీ స్టోరీల్ని సంధించి.. భారీగా భూ ఆక్రమణలకు పాల్పడినట్లుగా ప్రచారం జరిగిన రోజున కూడా సీఎం కేసీఆర్ పై ఆచితూచి అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి.

మొదట్లో ఉన్న మొహమాటాల్ని పక్కన పెట్టేసి.. ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు ఈటల. ఎప్పుడు జరుగుతుందో అర్థం కానట్లుగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికలు రాజకీయ పార్టీలకు కొత్త సవాలుగా మారాయి. సాధారణంగా ఏదైనా సెంటిమెంట్ ను కంటిన్యూ చేయటం పెద్ద టాస్కే అవుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రగిలిన రాజకీయాన్ని ఎవరికి వారు తమకుఅనుకూలంగా విషయాన్ని మార్చుకోవటం చాలా ముఖ్యం. కానీ.. ఇక్కడున్న సమస్య ఏమంటే..ఇలా రగిల్చిన సెంటిమెంట్ ను కొద్దికాలం పాటు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది.

అందుకే ఆకర్షణీయమైన పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్..తన ప్లానింగ్ ను వేగవంతం చేస్తున్న వేళ.. ఘాటైన విమర్శలు.. పదునైన ఆరోపణల్ని నమ్ముకున్నారు ఈటల. తాజాగా తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న గులాబీ నేతలకు హోల్ సేల్ గా చెక్ చెప్పేందుకు ఆయన భారీ సవాలుకు సిద్ధమయ్యారు. 200 ఎకరాల ఆసామి అన్న పేరుతో తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఈటల భారీ సవాల్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

2001లో పోలిస్తే ఇప్పుడు తనకున్న ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో కానీ సీబీఐతో కానీ విచారణకు తాను సిద్దమని.. మరి తన మాదిరి సీఎం కేసీఆర్.. మంత్రి హరీశ్ రావులు సిద్ధమేనా? అని సూటిగా ప్రశ్నించారు ఈటల. ఆస్తుల మీద వేసిన ప్రశ్న పూర్తి కాకముందే.. మరో సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్రంలో మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని పేర్కొన్నారు. ‘ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్న మాట నిజమా? కాదా?’ అని ప్రశ్నించారు.

హరీశ్ ఎప్పటికైనా టీఆర్ఎస్ పార్టీని తన పట్టులోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నాడని.. కానీ కేసీఆర్ జీవించి ఉండగానే.. మీ (హరీశ్ ను ఉద్దేశించి) చేతికి వచ్చే లోపే పార్టీ నాశనమైపోతుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ డెవలప్ మెంట్ పైనా.. జరుగుతున్న ఆగడాలపైనా చర్చకు సిద్ధమేనా? అని సవాలు విసిరారు. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా వరుస పెట్టి విసురుతున్న ఈ సవాళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి హరీశ్.. ఇద్దరిలో ఎవరు స్పందిస్తారో చూడాలి.


Tags:    

Similar News