జితేందర్ రెడ్డి - మురళీ మోహన్‌ లకు జరిమానా!

Update: 2020-02-08 15:25 GMT
మహబూబ్‌ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి షాక్ తగిలింది. 16వ లోక్ సభకు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ఆయన తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయనందుకుగాను రూ.3.87 లక్షల జరిమానా విధించింది. మరో మాజీ ఎంపీ - నటుడు మురళీ మోహన్‌ కు కూడా రూ.2.44 లక్షల జరిమానా విధించింది. గత లోక్ సభకు ఎన్నికై.. 17వ లోక్ సభకు ఎన్నిక కాకుండానే ప్రభుత్వ బంగ్లాల్లో ఉంటున్న 9మంది మాజీ ఎంపీలకు రూ.25 లక్షల జరిమానా విధించింది కేంద్ర ప్రభుత్వం.

రికార్డ్స్ ప్రకారం... 2014లో తెరాస నుంచి మహబూబ్‌ నగర్ లోక్ సభకు గెలిచిన జితేందర్ రెడ్డికి దేశ రాజధాని 1బీఆర్ ఎస్ లేన్‌ లో భవనాన్ని కేటాయించింది కేంద్రం. మురళీ మోహన్‌ కు న్యూఢిల్లీలోని 201 కావేరీ బంగ్లాను కేటాయించింది. జూన్ 25 - 2019తో 16వ లోక్ సభ ముగిసిన తర్వాత కూడా వీరిద్దరితో సహా 9 మంది మాజీలు బంగ్లాను ఖాళీ చేయకుండా అక్కడే ఉంటున్నారు. దీంతో వీరికి జరిమానా విధించింది కేంద్రం.

మాజీ ఎంపీలను రెండు వారాల్లో బంగ్లాలు ఖాళీ చేయించాలని హైకోర్టు ఫిబ్రవరి 5న కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా మాజీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసేందుకు అయిదేళ్ళ సమయం తీసుకుంటారా అని ప్రశ్నించింది. ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారని - మీరేమో బంగ్లాల్లో ఉచితంగా ఉంటున్నారని ఆగ్రహించింది. అంతేకాదు, అక్రమంగా ఉంటున్న వారిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని కూడా హెచ్చరించింది. వారు చెల్లించాల్సిన బకాయిలను కూడా రికవరీ చేయాలని ఆదేశించింది.

పదవీకాలం ముగిసినా బంగ్లా ఖాళీ చేయకుండా ఉన్న వారిపై పిటిషన్ దాఖలైంది. దీనిని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్ - జస్టిస్ సీ హరిశంకర్‌ లు విచారణ చేశారు. గడువు ముగిసినప్పటికీ మాజీ ఎంపీలు ఆ అధికారిక భవనాల్లో ఎలా ఉంటున్నారని గృహనిర్మాణ మంత్రిత్వ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు దశాబ్దం క్రితం పదవీవిరమణ పొందిన బ్యూరోక్రాట్లు కూడా అధికారిక భవనాల్లో ఇప్పటికీ ఉండటం, వారి బకాయిలు రూ.95 లక్షలు ఉండటంపై కోర్టు మండిపడింది.

మాజీ ఎంపీల డ్యూస్ విషయానికి వస్తే.. జితేందర్ రెడ్డి రూ.3.87 లక్షలు - మురళీ మోహన్ రూ.2.44 లక్షలు - రంజిత్ రంజన్ రూ.3.96 లక్షలు - ధనంజయ్ మహదిక్ రూ. 1.90 లక్షలు - గోపాల్ రూ.1.31 లక్షలు - వీణాదేవి రూ.2.54 లక్షలు - తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ రూ.1.51 లక్షలు - ఉదితి రాజ్ రూ.3.45 లక్షలు ఉన్నారు.
Tags:    

Similar News