అనుకోని అతిధికి ఉక్కు ఉద్యమ కాక

Update: 2022-02-12 14:30 GMT
ఆయన వెళ్లాల్సింది విజయవాడకు, బయల్దేరింది కోల్ కటా నుంచి. అయితే డైరెక్ట్ గా విజయవాడకు ఫ్లైట్ లేకపోవడం వల్ల బ్రేక్ జర్నీ అయింది. మధ్యలో విశాఖలో ట్రాన్సిట్ హాల్ట్ గా మూడు గంటలు ఆగాల్సి వచ్చింది. అక్కడ హ్యాపీగా విశాఖ అందాలు వీక్షిస్తూ రెస్ట్ తీసుకుని విజయవాడకు వేరే ఫ్లైట్ లో వెళ్లానుకున్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్.

అయితే ఆయన పక్కాగా  ముహూర్తం పెట్టుకుని విశాఖ వచ్చింది పక్కా రాంగ్ టైమ్. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం మంచి కాక మీద ఉంది. ఏడాది పాటు గోడు వెళ్లబోసుకున్నా, ఉద్యమించినా కూడా కేంద్రం అసలు ఖాతరు చేయడంలేదన్న మంట వారికి ఉంది. ఇక విశాఖ స్టీల్ ఉద్యమానికి ఏడాది అయిన సందర్భంగా నగరమంతా వేడిగా వాడిగా ఉద్యమాలు జరుగుతున్నాయి.

దాంతో విశాఖకు ఉక్కు మంత్రి వస్తున్నారు అన్న వార్త ఒక్క లెక్కన  ఉద్యమకారులకు చేరిపోయింది. ఆయన ట్రాన్సిట్ హాల్ట్ లో భాగంగా మూడు గంటల పాటు విశాఖ సర్క్యూట్ హౌస్ లో ఉంటారని కూడా భోగట్టా కూడా అలాగే వెళ్ళిపోయింది. ఇక ఏముంది పోలోమంటూ పెద్ద ఎత్తున ఉక్కు కార్మికులు సర్క్యూట్ హౌస్ కి ర్యాలీ గా వచ్చేశారు.

కేంద్ర మంత్రి గో బ్యాక్ అన్న నినాదాలతో అక్కడ హోరెత్తించేశారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసిన ఉక్కు మంత్రికి విశాఖలో అడుగు పెట్టే హక్కు లేదని కూడా ఉద్యమకారులు స్పష్టం చేశారు. ఈ మొత్తం సమాచారం ఎయిర్ పోర్టు లో ల్యాండ్ అయిన కేంద్ర మంత్రి గారికి చేరడంతో ఆయన సర్క్యూట్ హౌస్ కి రాకుండా అప్పటికపుడు వేరే ప్రైవేట్ హొటల్ కి తమ బస మార్చేశారు.

మొత్తానికి విశాఖ ఉక్కు ఉద్యమం పుణ్యమాని కేంద్ర మంత్రి గారు తన హాల్టూ రూటూ కూడా మార్చుకోవాల్సి వచ్చింది. కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా ఇదే విధంగా తాము ఘోరావ్ చేస్తామని ఉక్కు ఉద్యమకారులు అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించి తీరాల్సిందే అని కూడా స్పష్టం చేస్తున్నారు.

ఇప్పటిదాకా సాగిన ఉద్యమం ఒక ఎత్తు, ఇక మీదట మరో ఎత్తు అని కూడా అంటున్నారు. తాము విశాఖ స్టీల్ ని కాపాడుకోవడానికి, కేంద్ర పాలకులకు తన ఆవేదన వినిపించడానికి మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని కూడా చెబుతున్నారు.

మొత్తానికి విశాఖలో ఉక్కు పోరాటం ఎంత హాట్ గా ఉందో ట్రాన్సిట్ హాల్ట్ లో కేంద్ర మంత్రి కళ్లారా చూసారు, చెవులారా విన్నారు, ఆయన కేంద్ర పెద్దలతో చెప్పి విశాఖ స్టీల్ ని కాపాడేందుకు కృషి చేయాలని అంటున్నారు. అనుకోని అథిధిగా విశాఖ  వచ్చినా అన్నీ తెలిసిన మనిషిగా ఢిల్లీ వెళ్తున్న ఉక్కు మినిష్టర్ తనకు తెలిసినది  కేంద్ర పెద్దలకు చెప్పి  ఉక్కుని నిలబెట్టాలని ఉద్యమకారులు  కోరుతున్నారు.
Tags:    

Similar News