భారత్ పై పాక్ విజయం.. సౌదీ నుంచి తిరిగివచ్చేస్తున్న ప్రవాస భారతీయులు

Update: 2022-09-10 00:30 GMT
గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వచ్చి అక్కడే ఏదో ఒక చిన్న పని చేసుకొని నాలుగు రాళ్లు సంపాదించి భారత్ కు పంపిస్తూ పొట్టపోసుకునే వారు ఎందరో ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో మెజార్టీ భారతీయులే పనిచేస్తున్నారు. ఇప్పుడు వారికి భారత్ పై పాకిస్తాన్ విజయం మరింత కష్టాలు తెచ్చిపెట్టింది. కొంతమంది తెలుగు ప్రవాసీయులకు ఆసియాకప్ లో భారత్ పై పాకిస్తాన్ విజయం మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టింది.

ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన కొంతమంది యువకులు  పారిశుధ్య కార్మికులుగా పనిచేయడానికి సౌదీ అరేబియాలోని మదీన సమీప ప్రాంతానికి రెండు నెలల క్రితం వచ్చారు. అక్కడ ఉన్న సువిశాల క్యాంపులో దక్షిణాసియా దేశాల కార్మికులు ఉంటున్నారు. రోడ్లను శుభ్రం చేయడానికి వచ్చిన వీరికి ఆ పని కాకుండా.. చెత్త సేకరించే పనికి ట్రక్కుల్లో పంపుతున్నారు.

తమకు నచ్చని పనితోపాటు అధ్వాన్నమైన భోజనం పెడుతున్నారని తెలుగు ప్రవాసీయులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు రోడ్లను శుభ్రం చేసే పని మాత్రమే కావాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. రోడ్లను శుభ్రం చేస్తే అరబ్బుల నుంచి దయాదాక్షిణ్యాలు, టిప్పులు దాదాపు జీతంతో సమానంగా దొరుకుతాయని వీరి ఆశ. ఈ క్రమంలోనే వీరి ఆశలపై మరో పిడుగు పడింది.

నాలుగు రోజుల క్రితం దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ క్రికెట్ లో భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించడంతో పాకిస్తాన్ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. సమీప నేపాల్ కార్మికుడు అభ్యంతరం చెప్పగా.. అతడిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

తెల్లవారి నేపాల్ కార్మికుడు తన దేశాన్ని, ఇస్లాంను, మహ్మద్ ప్రవక్తను దూషించాడంని పాకిస్తాన్ కార్మికులు ఆరోపించారు.ఇ దే సమయంలో కొందరు భారత్ కు చెందిన తెలుగు ప్రవాసీయులు కూడా అతడికి మద్దతుగా ఉన్నారని ఘర్షణకు దిగారు.

దీంతో పాకిస్తాన్ కార్మికుల వేధింపుల కారణంగా తమను స్వదేశానికి పంపాలని భారతీయ కార్మికులు కోరుతున్నారు. భారతీయ కాన్సులేట్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఘర్షణలో భారతీయ కార్మికులకు సంబంధం లేదని తేల్చారు. ఇలా పాక్ గెలుపుతో సౌదీలోని భారతీయ కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News