డాలర్ కు రూ.75.. ఈ పతనం మరింత తప్పదా?

Update: 2021-04-15 09:30 GMT
ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని చెప్పే ప్రభుత్వాలు.. తమ ఏలుబడిలో దేశం మునుపెన్నడు లేనంత బలంగా తయారైనట్లుగా జబ్బలు చరిచే తీరుకు భిన్నంగా డాలర్ తో రూపాయి మారకం విలువ భారీగా తగ్గిపోవటం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఒక డాలర్ కు రూపాయి ఏకంగా 75.05కు చేరుకోవటం షాకింగ్ గా మారింది. ఈ క్షీణత తొమ్మిది నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుందన్నది మర్చిపోకూడదు. గత ఏడాదితో పోలిస్తే.. ఇదే సమయంలో నాటి రూపాయి విలువతో పోలిస్తే.. ఇప్పుడు రెండుశాతం క్షీణించింది. ఇంతకీ మన రూపాయికి ఎందుకింత కష్టం వచ్చిందంటే.. దానికి అదనపు ద్రవ్య లభ్యతే కారణంగా చెప్పాలి.

డాలర్ తో రూపాయి మారకం ఇంత భారీగా తగ్గటానికి కారణం ఏమిటి? ఇదే పరిస్థితి కొనసాగనుందా? ఒకవేళ అదే నిజమైతే.. అందుకు కారణం ఏమిటి? రూపాయి క్షీణత ఎంతవరకు సాగే అవకాశం ఉందన్న విషయాల్ని చూస్తే..  ప్రభుత్వం భారీగా రుణాలు తీసుకోవటానికి వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఇండియా రూ.లక్ష కోట్ల విలువైన బాండ్లను మార్కెట్ల నుంచి కొనుగోలు చేయనుంది. తొలిదశ నుంచి రూ.25వేల కోట్ల కొనుగోళ్లను ఈ రోజు నుంచి చేయనుంది. ఇప్పటివకే వ్యవస్థలో రూ.7లక్షల కోట్ల ద్రవ్య లభ్యత ఉంది.

తాజాగా చేస్తున్న బాండ్ల కొనుగోలు కారణంగా ద్రవ్య లభ్యత పెరగనుంది. దీంతో.. రూపాయి విలువ మీద ఒత్తిడిని పెంచుతుంది. స్థానిక కరెన్సీ సరఫరా పెరిగితే.. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుంది. వ్యవస్థలోకి మరింత నగదును తీసుకురావటంతో వడ్డీ రేట్లు దీర్ఘకాలం తక్కువగానే కొనసాగే వీలుంది. అంటే.. ద్రవ్యోల్బణం పెరిగినా.. వడ్డీ రేట్లు మాత్రం పెరగవన్న సంకేతాన్ని ఆర్ బీఐ ఇస్తోంది. దీంతో.. పెద్ద పెట్టుబడిదారులు తమ మూలధనాల్ని భారత్ నుంచి బయటకు తీసుకెళ్లటానికి కారణమవుతుంది.

సెకండ్ వేవ్ లో భాగంగా పెరుగుతున్నకేసులు ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయితో పాటు మహారాష్ట్రలో కేసులు రికార్డు స్థాయిలో చేరాయి. లాక్ డౌన్ తరహా ఆంక్షల్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా రూపాయి విలువ క్షీణతకే దారి తీస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76 వరకు క్షీణించే వీలుందని చెబుతున్నారు. రూపాయి మరింత క్షీణిస్తే.. దిగుమతు వస్తువుల ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా ముడి చమురు బిల్లు ఎక్కువ అవుతుంది. దీంతో.. పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఏమైనా.. డాలర్ తో రూపాయి మారకం విలువ ఎక్కువ ఆటుపోట్లు కాకుండా ఉండటం ఉత్తమం. ఈ విషయంలో మోడీ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News