ఆ ప్ర‌పంచ హీరో అప్ప‌ట్లో మాత్రం ప‌క్కా విల‌న్?

Update: 2017-08-04 08:11 GMT
హీరో కాస్తా జీరో కావ‌టం తెలిసిందే. అయితే.. ప్ర‌పంచ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకొని హీరోగా స‌రికొత్త క్రేజ్ సొంతం చేసుకున్న వ్య‌క్తి.. పూర్వాశ్ర‌మంలో పెద్ద విల‌న్ అన్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు రావ‌టం సంచ‌ల‌నంగా మారింది. కొద్ది నెల‌ల క్రితం ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికించిన వాన్నాక్రై సైబ‌ర్ దాడిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న వ్య‌క్తిగా మార్క‌స్ హ‌చిన్స్ పేరు మారుమోగింది.

ప్ర‌పంచ దేశాల్ని వ‌ణికించిన ఈ వైర‌స్‌ కు చెక్ పెట్టేలా ఈ మాల్ వేర్ నిపుణుడు చేసిన సాయాన్ని ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. వాన్నాక్రై దెబ్బ‌కు మొరాయించిన సిస్ట‌మ్స్ ను తిరిగి ప‌ని చేసేలా చేయ‌టంలో మార్క‌స్ కృషిని ఎవ‌రూ త‌క్కువ చేయ‌లేరు. 22 ఏళ్ల వ‌య‌సున్న ఇత‌గాడు రెండు నెల‌ల క్రితం ప్ర‌పంచ హీరోగా సైబ‌ర్ ప్ర‌పంచంలో గుర్తింపు పొందారు. అలాంటి అత‌డ్ని తాజాగా అమెరికా పోలీసులు అరెస్ట్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. అయితే.. ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌టానికి స‌ముచిత‌మైన కార‌ణం లేక‌పోలేదు.

వాన్నాక్రై వైర‌స్‌ కు చెక్ పెట్టిన మార్క‌స్ గ‌తంలో త‌న‌కు తానే ఒక వైర‌స్ ను సృష్టించిన పాత నేరం ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. క్రోనోస్ బ్యాకింగ్ ట్రోజ‌న్ అనే పేరున్న వైర‌స్ ను త‌యారు చేసిన ఇత‌డు దాన్ని త‌న స్నేహితుడితో క‌లిసి 2014-15 మ‌ధ్య కాలంలో తయారు చేసిన‌ట్లు గుర్తించారు.

ఈ మాల్ వేర్ ను వెబ్ బ్రౌజ‌ర్లకు పంపంటం ద్వారా బ్యాంకు ఖాతాల పాస్ వ‌ర్డ్‌.. యూజ‌ర్ నేమ్ ల‌ను ఇది రికార్డు చేస్తుంది. ఈ మాల్ వేర్ ను త‌యారు చేసి.. దాన్ని అమ్మిన ఇత‌గాడు భారీగా లాభ‌ప‌డ్డాడు. అయితే.. ఈ మాల్ వేర్‌కు సంబంధించిన కేసు ఒక‌టి అప్ప‌ట్లో విస్క‌న్సిన్ ఫెడ‌ర‌ల్ కోర్టులో న‌మోదైంది. కేసు విచార‌ణ‌లో భాగంగా అస‌లు నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి.

దీంతో అత‌డ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. ఇదిలా ఉండ‌గా బ్రిట‌న్ లోని హ్యాక‌ర్స్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ గురూస్ వార్షిక స‌ద‌స్సుకు హాజ‌రై.. తిరిగి వ‌స్తున్న వేళ లాస్ వేగాస్ లో మార్క‌స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం అత‌డ్ని కోర్టులో హాజ‌రుప‌ర్చారు.
Tags:    

Similar News