టీఆర్ఎస్ మంత్రుల్లో భ‌యం

Update: 2021-11-23 02:30 GMT
కొత్త‌గా వ‌చ్చే ఎమ్మెల్సీలు త‌మ ప‌ద‌వుల‌ను ఎక్క‌డ లాక్కుంటారోన‌నే భ‌యం టీఆర్ఎస్ మంత్రుల్లో ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క‌నీసం ఒక‌రిద్ద‌రికి క‌చ్చితంగా ప‌ద‌వి గండం ఉంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఎమ్మెల్యే కోటా స్థానంలో ఆరుగురు ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించారు. వాళ్ల‌కు ప‌ద‌వి ద‌క్క‌డం లాంఛ‌న‌మే. దీంతో పాటు త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల కోటా కింద 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ ద్వారా మంత్రి ప‌ద‌వి కొట్టేది ఎవ‌రు? ఎవ‌రికి ఎస‌రు పెడ‌తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఎమ్మెల్యే కోటా కింద బండ ప్ర‌కాశ్‌, క‌డియం శ్రీహ‌రి, గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, వెంక‌ట్రామిరెడ్డి, కౌశిక్‌రెడ్డి, త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు ఎమ్మెల్సీలు కాబోతున్నారు. ఈ జాబితాలో రాజ్య‌స‌భ సభ్యుడు బండ‌ప్ర‌కాశ్‌ను ఎంపిక చేయడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ నుంచి వెళ్లిపోయిన ఈట‌ల రాజేంద‌ర్ స్థానాన్ని అదే సామాజిక వ‌ర్గానికి చెందిన బండ ప్ర‌కాశ్ భ‌ర్తీ చేయాల‌ని అందుకే ఆయ‌న్ని ఎమ్మెల్సీ చేయాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహంగా చెపుతున్నారు. ఇంకా రెండేళ్ల ప‌ద‌వీ కాలం ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న్ని రాజ్య స‌భ నుంచి ర‌ప్పిస్తున్నారు కాబట్టి ప్ర‌కాశ్‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నే ప్ర‌చారం సాగుతోంది. అయితే ఆయ‌న రాక‌తో శాఖ‌లు మారే అవ‌కాశం ఉంది కానీ ఇత‌ర మంత్రుల ప‌ద‌వులైతే పోవు. ఎందుకంటే ఈట‌ల స్థానంలోనే ఆయ‌న వ‌స్తున్నారు.

ఇక గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మాజీ క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి కార‌ణంగా ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, మ‌ల్లారెడ్డి ప‌ద‌వులు పోతాయ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుఖేంద‌ర్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌నే హామీ మేర‌కే ఎమ్మెల్సీగా చేసిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు క‌లెక్ట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన వెంక‌ట్రామిరెడ్డికి కూడా మంత్రి ప‌ద‌విని కేసీఆర్ ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలిసింది. వీళ్ల సామాజిక వ‌ర్గాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, మల్లారెడ్డిపై వేటు త‌ప్ప‌ద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

మ‌రోవైపు కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వ‌చ్చిన‌పుడు ఉప ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన క‌డియం శ్రీహ‌రి కూడా ఈ సారి మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక ఇటీవ‌ల ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి గెలిచిన ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, స్థానిక సంస్థ‌ల కోటాలో నెగ్గిన ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి కూడా కేబినేట్‌లో స్థానం కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి అనూహ్య నిర్ణ‌యాల‌కు వెన‌కాడ‌ని కేసీఆర్ వీళ్ల ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.
Tags:    

Similar News