ఫిడెల్ క్యాస్ట్రో క‌న్నుమూత‌

Update: 2016-11-26 09:18 GMT
అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన క‌్యూబా విప్లవ నేత, ఆ దేశ‌ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో క‌న్నుమూశారు. 90 ఏళ్ల వ‌య‌సున్న క్యాస్ట్రో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్యూబా స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.29 గంటలకు మృతి చెందినట్లు ఫిడెల్ సోద‌రుడు అయిన క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో నేషనల్ టెలివిజన్లో ప్రకటించారు.

1926, ఆగ‌స్ట్ 13న జ‌న్మించిన క్యాస్ట్రో.. 1959, జ‌న‌వరి నుంచి 1976 వరకు క్యూబా ప్రధానిగా.. తర్వాత 1976 నుంచి 2008, ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు క్యూబా అధ్యక్షుడిగా ప‌నిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో చివరిసారి కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ చివరి రోజు  క్యాస్ట్రో అరుదైన ప్రసంగం చేశారు. అగ్రరాజ్యం గుండెల్లో గుబులు పుట్టించిన క్యాస్ట్రోను హ‌త్య చేయ‌డానికి సీఐఏ ఏకంగా 638 సార్లు హ‌త్యాయ‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. 2008లో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని తమ్ముడు రౌల్ క్యాస్ట్రోకు బాధ్య‌త‌లు అప్పగించారు. క్యూబాను మళ్లీ ప్రజలకు అప్పగించిన దేవుడిగా ఆయన మద్దతుదారులు కీర్తించగా.. ఆయన వ్యతిరేకులు మాత్రం ప్రత్యర్థులను దారుణంగా అణచివేశారని ఆరోపిస్తారు. క్యూబాలో పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా త‌రిమేశారు.క్యూబాను ఏక‌పార్టీ దేశంగా మార్చి 49 ఏళ్ల పాటు క్యూబాను పాలించారు.

ప‌రోక్ష యుద్ధం స‌మ‌యంలో క్యాస్ట్రో కేంద్ర బిందువుగా ఉన్నారు. అమెరికా సామ్రాజ్య‌వాదానికి వ్య‌తిరేకంగా పోరాడ‌టంతో అగ్ర‌రాజ్యం, దాని మిత్ర‌దేశాలు ఆయ‌న‌ను దోషిగా చూశాయి. అమెరికాకు వ్య‌తిరేకంగా ఆయ‌న చేసిన ప్ర‌సంగాలు క్యూబ‌న్ల‌ను ఉత్తేజితుల‌ను చేశాయి. మిలిట‌రీ గ్రీన్ దుస్తులు, చేతిలో సిగార్‌తో ప్రత్యేక ఆహార్యం క్యాస్ట్రో సొంతం. 2006 నుంచి ఆయ‌న పేగు సంబంధ వ్యాధితో బాధ‌ప‌డుతూ తాజాగా తుది శ్వాస విడిచారు.
Tags:    

Similar News