బ్రేకింగ్: విజయవాడ కొవిడ్ సెంటర్ లో భారీ ఫైర్ యాక్సిడెంట్

Update: 2020-08-09 03:19 GMT
ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న గుజరాత్ లో ఏ రీతిలో అయితే.. కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుందో.. అదే రీతిలో తాజాగా విజయవాడ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా రమేశ్ ఆసుపత్రి సెంటరుగా హోటల్ స్వర్ణ ప్యాలస్ ను వినియోగిస్తున్నారు. ఇందులో నలభై మంది వరకు పేషెంట్లు ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ తో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. తెల్లవారుజాము ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగటం.. రోగులు నిద్రలో ఉండటంతో వెంటనే స్పందించే విషయంలో ఆలస్యం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటం.. దట్టంగా పొగ కమ్ముకోవటంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో.. భవనంలో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గ్రౌండ్.. ఫస్ట్ ఫోర్లలో మంటలు అలుముకున్నాయి. ఇతర అంతస్తులకు పొగ వ్యాపించింది. ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం.. కొందరు ఒకటో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. మరికొందరిని కిటికీ అద్దాలు పగలగొట్టి నిచ్చెనల సాయంతో అగ్నిమాపక సిబ్బంది రోగుల్ని కిందకు దించారు.

ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లుగా తెలుస్తోంది. భవనంలో ఉన్న నలభై మందిలో పది మంది ఆసుపత్రి సిబ్బంది కాగా.. ముప్ఫై మంది రోగులుగా చెబుతున్నారు. మంటలున్న ప్రాంతంలో చిక్కుకుపోయిన వారిలో 13 మందిని క్షేమంగా తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. దట్టంగా అలుముకున్న పొగతో బాధితులు శ్వాస తీసుకోవటం కష్టంగా మారిందని.. దీంతో కిటికీల్లో నుంచి కేకలు వేశారన్నారు. ప్రమాదం నుంచి రక్షించిన రోగుల్ని వెంటనే లబ్బీపేట.. మెట్రోపాలిటన్ హోటల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నారు. సహాయ చర్యల్ని ముమ్మరం చేశారు.


Tags:    

Similar News