మోడీ ప్లాన్: జమిలి గట్టెక్కించే బాధ్యత.. చంద్రబాబుకు?
అంటే.. చంద్రబాబు సారథ్యంలో కమిటీ వేసి.. అది అన్ని రాష్ట్రాల పార్టీలను.. అధికార పక్షాలను కలుసుకుని.. లేదా సంప్రదించి.. జమిలి బిల్లుకు ఒప్పించే ప్రయత్నం చేయనున్నారన్న మాట.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాను అనుకున్నది సాధించే నాయకుడు. ఈ క్రమంలో ఆయన ఏవైనా ఇబ్బందులు వస్తే.. వాటిని పరిష్కరించేందుకు.. మిత్రపక్షాలను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత.. సర్దుబాటు దిశగా అడుగులు వేస్తారు. 2016లో దేశంలో పెద్ద నోట్లను రద్దు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున రగడ చోటు చేసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు సహా.. మేధావి వర్గాలు కూడా తప్పుబట్టాయి. ఈ సమయంలో అందరినీ సర్దు బాటు చేయడానికి.. మోడీ ప్లాన్ చేశారు.
ముఖ్యమంత్రులతో కూడిన కమిటీ వేస్తున్నట్టు ప్రకటించి.. దానికి కన్వీనర్‌గా అప్పటి సీఎం చంద్రబాబు ను నియమించారు. ఈ కమిటీ అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, విపక్ష నేతలతో భేటీ అయి.. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు పై అన్ని వర్గాలను ఒప్పించాయి. తర్వాత రగడ తేలిపోయి.. మోడీ హీరో అయిపోయారు. ఇక, మూడు వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన మోడీకి మరింత సెగ తగిలింది. అయినా.. ఆయన పట్టుబట్టి.. అమలు చేయాలని అనుకున్నారు. కానీ, బెడిసి కొట్టింది. దీనికి కారణం.. సొంత నేతలేనని అంటారు. కేవలం బీజేపీ నాయకులతో ఆయన కమిటీ వేసుకున్నారు.
ఇక, ఇప్పుడు ఒకే దేశం-ఒకే ఎన్నికల మంత్రాన్ని ప్రధాని మోడీ పఠిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తో కమిటీ ఏర్పాటు చేసి.. ఒక నివేదికను తెప్పించుకున్నారు.(ఇది కూడా అనుకూలమేలేండి!) దీనిని ఇటీవల లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. పెద్ద ఎత్తున యాగీ జరిగింది. కాంగ్రెస్ సహా.. విపక్షాలన్నీ.. ఒకే జట్టుగా నిలిచాయి. ఈ విషయాన్ని తూర్పారబట్టాయి. ఇక, మిత్రపక్షాలైన బిహార్‌కు చెందిన జేడీయూ వంటివి మౌనంగా ఉన్నాయి.
దీంతో మోడీ గుండెల్లో రాయి పడింది. దీంతో ఇప్పుడు జమిలి బిల్లు ఇప్పుడు కాకపోతే.. మరో మూడు మాసాల తర్వాతైనా.. పార్లమెంటుకురానుంది.(జేపీసీ వేశారు కదా.. అది అధ్యయనం చేయాల్సి ఉంది). ఈ క్రమంలో ఇటు మిత్ర పక్షాలతో పాటు.. అటు ప్రతిపక్షాలు కూడా.. దీనిని ఆమోదించేలా కొంతలో కొంతైనా వారిని ఒప్పించేలా చేయాలన్నది మోడీ ఆలోచన. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును ఆదిశగా నడిపించేందుకు ప్రధాని వ్యూహం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అంటే.. చంద్రబాబు సారథ్యంలో కమిటీ వేసి.. అది అన్ని రాష్ట్రాల పార్టీలను.. అధికార పక్షాలను కలుసుకుని.. లేదా సంప్రదించి.. జమిలి బిల్లుకు ఒప్పించే ప్రయత్నం చేయనున్నారన్న మాట. ఇక్కడ చంద్రబాబునే ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్న వస్తుంది. దేశంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో సీనియర్ కావడం.. `విజన్ బాబు` అనే బ్రాండు ఉండడం.. వంటివి మోడీకి కలిసి వస్తున్న అంశాలు. ఆయనైతే.. సమర్థవంతంగా అందరినీ ఒప్పించే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది.