తొలిసారి.. మన మార్కెట్ విలువ రూ.191 లక్షల కోట్లు

Update: 2021-01-05 10:10 GMT
దేశీయంగా స్టాక్ మార్కెట్ జోరు కొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది. అప్పుడప్పుడు షాకులు తగులుతున్నా.. మార్కెట్ మాంచి ఊపులో నడుస్తోంది. గడిచిన తొమ్మిది రోజులుగా లాభ పడుతూ వచ్చిన స్టాక్ మార్కెట్.. తాజాగా సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది. మార్కెట్ చరిత్రలో తొలిసారి 48వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. తొమ్మిది రోజుల వ్యవధిలో ఏకంగా 2623 పాయింట్లు జంప్ చేయటంతో.. మార్కెట్ విలువకు రూ.12.89లక్షల కోట్లు జతైంది. సాధారణంగా సెన్సెక్స్ ఒడిదుడుకులకు లోనైన సందర్భంలో లక్షల కోట్లు ఆవిరి కావటం తెలిసిందే. ఆ సందర్భంగా ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున లాభపడటం ఆసక్తికరంగా మారింది.

దీంతో.. బీఎస్ఈ మార్కెట్ విలువ ఏకంగా రూ.191 లక్షల కోట్లకు చేరింది. డాలర్లలో లెక్క చెప్పాలంటే 2.6 ట్రిలియన్లకు సమానం. ఇంత భారీగా పెరగటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. మార్కెట్ ఇంత సానుకూలంగా ఉండటానికి కారణం విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ ఈక్విటీలలో భారీగా పెట్టుబడి పెట్టటం ఒక కారణం. గడిచిన రెండు నెలల్లో దేశీ స్టాక్స్ లో విదేశీ మదుపరులు ఏకంగా 14 బిలియన్ డాలర్ల వరకు పెట్టినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

దేశీయంగా రెండు వ్యాక్సిన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం.. రికార్డు స్థాయిలో జీఎస్ టీ వసూళ్లు నమోదు కావటం.. ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా రికవరీ అవుతున్నట్లుగా ఆర్ బీఐ తాజా నివేదిక కూడా సానుకూల పరిణామాలకు కారణంగా మార్కెట్ మరింత జోరుగా మారింది. తాజా పరిణామాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. తాజాగా ఆ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ రూ.12.49లక్షల కోట్లుగా ఉంటే.. మరో సాఫ్ట్ వేర్ దిగ్గజం టీసీఎస్ రూ.11.50లక్షల కోట్లుగా రెండో ర్యాంకులో నిలిచింది.


Tags:    

Similar News