అమ‌రావ‌తికి మ‌రో పెద్ద స‌మ‌స్య‌​

Update: 2015-11-20 07:08 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతి నిర్మాణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి అవ‌కాశాలు ఎన్ని వ‌స్తున్నాయో...అడ్డంకులు అన్నీ వ‌స్తున్నాయి. రాజధాని ప్రాంతంలో అటవీ భూముల సేకరణపై కొనసాగుతున్న వివాదం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. అట‌వీ భూముల‌ను రాజ‌ధాని అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోవ‌డంలో  కేంద్ర అనుమతుల్లో జాప్యం పెరుగుతుండగా మరోవైపు తాజాగా ఆర్థిక క‌ష్టాలు చుట్టుముడుతున్నాయి.

అట‌వీ భూముల‌ను డీనోటిఫై చేయాలంటే ఆ భూముల‌ కోసం ప్ర‌బుత్వం చెల్లించాల్సిన మొత్తం భారీగా ఉంటుంది. అదేక్ర‌మంలో ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇవ్వడమూ భారంగానే మారుతుంద‌ని అధికారులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తున్నారు.

అమ‌రావ‌తి నిర్మాణానికి ఉద్దేశించిన సీఆర్‌ డీఏ పరిధిలో 19,256 హెక్టార్ల అటవీ భూమిని డీ-నోటిఫై చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికి స్టేజ్‌-2 అనుమతి కావాలంటే హెక్టారుకు ఎన్‌ పీవీ (నెట్‌ ప్రజెంట్‌ వాల్యూ) కింద ఏడు లక్షలు, కొత్త ప్రాంతంలో పచ్చదనం పెంపకం కోసం రూ.3లక్షల వంతున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద హెక్టారుకు రూ.10 లక్షల చొప్పున దాదాపు రూ.2వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది!! అయితే ఆర్థిక క‌ష్టాలు ఉన్న నేప‌థ్యంలో చిన్న చిన్న బిల్లుల చెల్లింపులే చేయలేని ఏపీ ప్రభుత్వం ఇంత మొత్తం ఎలా చెల్లిస్తుందనేది ప్రశ్నార్థకమే. ఈ విష‌యమై  అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌గా... మొత్తం 19,256 హెక్టార్ల భూమిని ఒకేసారి డి-నోటిఫై చేయకుండా విడతల వారీగా తీసుకుంటే చెల్లించాల్సిన నిధుల భారం తగ్గుతుందని సీనియర్‌ అధికారులు ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు తెలిసింది. తీసుకున్న అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలో భూమిని ఇవ్వాల్సి ఉన్న నేప‌థ్యంలో అధికారులు ఆ ప‌నుల్లో ప‌డ్డారు. ఇందుకు కడప - కర్నూలు జిల్లాల్లో భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News