ఈ గెలుపు స‌రే..మోడీకి అస‌లు ప‌రీక్ష ముందుంది

Update: 2018-03-03 11:30 GMT
దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిని - ఉత్కంఠ‌ను రేకెత్తించిన ఈశాన్య రాష్ర్టాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. బీజేపీకి తీపిక‌బురు మిగిల్చేలా ఆ ఫ‌లితాలు ఉన్నాయి. క‌మ్యూనిస్టుల కంచుకోట అయిన త్రిపుర‌లో బీజేపీ గెలుపొందింది. విజ‌యం ఖాయ‌మ‌నుకున్న కాంగ్రెస్ పార్టీకి - క‌మ్యూనిస్టుల‌కు  అప‌జ‌య‌మే మిగిలింది. సహ‌జంగానే ఇది బీజేపీకి అనూహ్య క‌బురు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి - ఆయ‌న ఆప్తుడు అనుకున్న బీజేపీ ర‌థ‌సార‌థి అమిత్‌ షా స‌త్తాకు ఇదే నిద‌ర్శ‌నం.

అయితే, మోడీ- షా ద్వ‌యంకు ఈ విజ‌యం త‌మ భ‌విష్య‌త్‌ పై నిశ్చింత‌గా ఉంచేది కాద‌ని అంటున్నారు. ఈ ఫ‌లితాల‌ను విశ్లేషించుకుంటూనే...త్వ‌ర‌లో ఎదురుకానున్న అస‌లు ప‌రీక్ష‌కు వారు సిద్ధం కావాల్సి ఉంటుంద‌ని చెప్తున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నిక‌లు ఈ ద్వ‌యానికి అస‌లు ప‌రీక్ష అని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు. కీల‌క రాష్ట్రాలైన‌ రాజ‌స్థాన్‌ - మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ - క‌ర్ణాట‌క‌ - చ‌త్తీస్‌ ఘ‌డ్ ఎన్నిక‌లు మోడీ ఇమేజ్‌ ను తేల్చిచెప్తాయ‌ని అంటున్నారు. 744 అసెంబ్లీ సీట్ల‌కు జ‌రిగే ఎన్నిక‌లు ఆయ‌న‌ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు సెమీ ఫైన‌ల్స్ వంటివ‌ని చెప్తున్నారు. ఈశాన్య రాష్ర్టాల కంటే కీల‌క‌మైన ఈ నాలుగు రాష్ర్టాలు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ప‌రీక్ష అని చెప్తున్నారు. ఈ నాలుగు రాష్ర్టాల్లో మూడు బీజేపీ పాలిత రాష్ర్టాలు కాగా - ఒక‌టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం.

ద‌క్షిణాదిలో కీల‌క‌రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. క‌ర్ణాట‌క‌లో ఎలాగైన గెలుపొందేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - బీజేపీ జాతీయ ర‌థ‌సార‌థి అమిత్ షా శ‌తవిధాల ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌లు ఇప్ప‌టికే ప్ర‌చారం ప్రారంభించారు. 224 సీట్లకు జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల పోరులో ఎలాగైన గెలిచేందుకు కేంద్ర‌మంత్రి ప్రకాశ్ జ‌వ‌దేక‌ర్‌ ను ఇంచార్జీగా - మ‌రో మంత్రి పియూష్ గోయ‌ల్‌ ను కో ఇంచార్జీగా నియ‌మించారు.ఇక బీజేపీ పాలిత రాష్ర్టాలు - అందులోనూ ఆ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులుగా బ‌ల‌మైన నేత‌లు ఉన్న రాజ‌స్థాన్‌ - చ‌త్తీస్‌ ఘ‌డ్‌ విష‌యంలో బీజేపీకి గ‌ట్టి ప‌రీక్ష ఎదురుకానుంద‌ని అంటున్నారు. రాజ‌స్థాన్‌లో సీఎం వ‌సుంధ‌రా రాజే సింధియా నుంచి ఈ దఫా అధికార ప‌గ్గాలు చేప‌ట్ట‌డం అంత ఈజీ కాద‌ని తెలుస్తోంది. అజ్మీర్ మ‌రియు అల్వార్ లోక్‌ స‌భ స్థానాల‌కు జ‌రిగిన  ఉప ఎన్నికల్లో బీజేపీకి ద‌క్కిన ఓట్లే ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రమైన చ‌త్తీస్ ఘ‌డ్‌ లో గ‌త ఎన్నిక‌ల్లో ఒక్కశాతం ఓటు వాటాతో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ద‌ఫా ఎలాగైన అధికారం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్ సింగ్‌ పై ఉన్న వ్య‌తిరేక‌త‌తో పార్టీకి గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. దీంతో ఇక్క‌డ మోడీ-షాకు గ‌ట్టి ప‌రీక్ష ఎదురవ‌డం ఖాయ‌మ‌ని చెప్తున్నారు. 230 సీట్లుగ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ...ఆ పార్టీ కంటే...కాంగ్రెస్ పార్టీకి కాస్త సానుకూల అవ‌కాశాలే ఉన్నాయ‌ని అంటున్నారు. ఇటీవ‌ల చిత్ర‌కూట్ అసెంబ్లీకి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ గెలుపొంద‌డం ఆ పార్టీకి బ‌లం పెరుగుతుంద‌నేందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్లు దిగ్విజ‌య్‌ సింగ్‌ - జ్యోతిరాధిత్య సిందియా - క‌మ‌ల్ నాథ్ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయ‌డం ఆ పార్టీ విజ‌య‌వ‌కాశాల‌పై భ‌రోసా పెంచేలా ఉంద‌ని చెప్తున్నారు. స్థూలంగా ఈశాన్య రాష్ర్టాల కంటే అస‌లు సిస‌లు ప‌రీక్ష రాబోయే నాలుగు రాష్ర్టాల్లో మోడీ- అమిత్ షా ఎదుర్కోవ‌డం ఖాయ‌మ‌ని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News