గాలి ఇంట్లో ముదిరిన వార‌స‌త్వ పోరు!

Update: 2018-07-31 04:45 GMT
ఆవేశ‌పూరిత ప్ర‌సంగాలు.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ త‌ర‌చూ మీడియాలో క‌నిపించే చిత్తూరు జిల్లా సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు సుప‌రిచితుడే. ఈ ఏడాది మొద‌ట్లో ఆయ‌న మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.  ఆయ‌న మ‌ర‌ణంతో వారింట్లో వార‌సత్వ పోరును ర‌గిలేలా చేసింది. గాలి ముద్దుకృష్ణ‌మ‌కు ఇద్ద‌రు కొడుకులు. పెద్ద కొడుకు పేరు భానుప్ర‌కాశ్‌. చిన్న‌కొడుకు పేరు జ‌గ‌దీశ్‌. వీరిద్ద‌రూ స‌మ‌న్వ‌యం చేసుకొని ఒకే మాట‌గా ఉండే స‌రిపోయేది.

కానీ.. ఇరువురికి రాజ‌కీయాల మీద ఆస‌క్తి ఉండ‌టంతో.. తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వానికి తామే అస‌లుసిస‌లు వార‌సులు అన్న‌ట్లుగా ఉండ‌టం ఇప్పుడు న‌గ‌రి రాజ‌కీయాల్ని వేడెక్కేలా చేస్తోంది. గాలి ముద్దుకృష్ణ‌మ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ వార‌స‌త్వంలో భాగంగా ఆయ‌న స‌తీమ‌ణి స‌ర‌స్వ‌త‌మ్మ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇన్ ఛార్జ్ గా వేరే వారిని ఎంపిక చేయ‌నున్న‌ట్లుగా పార్టీ పేర్కొంది.

అయితే.. నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ ప‌ద‌వి త‌మ కుటుంబానికే చెందాలంటూ గాలి కొడుకులు ఇద్ద‌రూ డిసైడ్ కావ‌ట‌మే కాదు.. అందుకు త‌గ్గ‌ట్లు రాజ‌కీయం మొద‌లుపెట్టారు. ఇదిలా ఉంటే.. తండ్రి రాజ‌కీయ వార‌సుడు చిన్న‌కొడుకు జ‌గ‌దీశ్ అంటూ త‌ల్లి స‌ర‌స్వ‌త‌మ్మ తేల్చ‌ట‌మే కాదు.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్ సైతం అత‌డికే అంటూ ప్ర‌క‌టించ‌టం పార్టీ అధిష్ఠానానికి మండేలా చేసింది. దీనిపై స‌ర‌స్వ‌త‌మ్మ‌కు చిన్న‌పాటి వార్నింగ్ కూడా ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

తాను కామ్ గా ఉంటే.. తండ్రి వార‌స‌త్వాన్ని త‌న త‌మ్ముడు హైజాక్ చేసేస్తున్నాడ‌న్న భావ‌న‌కు గురైన భానుప్ర‌కాశ్‌.. తాజాగా యువ‌గ‌ర్జ‌న పేరుతో ఒక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. త‌న‌కు కుటుంబ మ‌ద్ద‌తు లేకున్నా.. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో త‌న‌కున్న రాజ‌కీయ ప‌రిచ‌యాల‌తో ఈ కార్య‌క్ర‌మాన్ని భారీగా నిర్వ‌హించారు. దీంతో.. గాలి ముద్దుకృష్ణ‌మ ఇంట్లో వార‌స‌త్వ పోరు ఇప్ప‌టివ‌ర‌కూ నాలుగు గోడ‌ల మ‌ధ్య‌నే ఉండ‌గా.. యువ‌గ‌ర్జ‌న పుణ్య‌మా అని.. అది కాస్తా వీధుల్లోకి వ‌చ్చింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌రోవైపు త‌న సంపూర్ణ మ‌ద్ద‌తు చిన్న కొడుక్కి ఇచ్చిన స‌ర‌స్వ‌త‌మ్మ ఓప‌క్క‌.. ఇంటి అండ లేకున్నా.. త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో తాను పార్టీ అధినేత.. యువ‌నేత లోకేశ్ మ‌న‌సును దోచుకునేందుకు భానుప్ర‌కాష్ ప్ర‌య‌త్నాల్ని మ‌రింత ముమ్మ‌రం చేశారు. మ‌రీ.. వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News