విశాఖ వాసిగా..గంటా ఓటు జగన్ కేనట

Update: 2020-01-28 14:10 GMT
ఎప్పుడెప్పుడు తమకు హ్యాండిచ్చేసి జగన్ పంచన చేరతారా? అని టీడీపీ నేతలంతా అనుమానంగా చూస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు... ఇప్పటికైతే టీడీపీలోనే కొనసాగుతున్నారు గానీ... ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా... టీడీపీ నేతల బీపీని మాత్రం అమాంతం పెంచేస్తున్నారనే చెప్పాలి. ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై గంటా ఎలా స్పందిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మొన్నామధ్య నోరు విప్పిన గంటా... విశాఖ వాసిగా... ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను చేస్తానంటే తానెందుకు వద్దంటానని వ్యాఖ్యానించారు. తాజాగా అదే మాటను మరోమారు ప్రస్తావించిన గంటా... ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ఎంపిక చేస్తున్నట్లుగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా విశాఖ వాసిగా తాను ఈ విషయంలో జగన్ కే ఓటేస్తానని, అయితే ఈ విషయంలో పార్టీ స్టాండ్ పార్టీదేనని, ఇదే విషయాన్ని తాను ఇదివరకే చంద్రబాబుకు చెప్పానని కూడా గంటా సంచలన వ్యాఖ్యలు చేశారు.

మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ... పార్టీ శ్రేణులతో మంగళవారం భేటీ అయిన సందర్భంగా గంటా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాజాగా శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై గంటా తనదైన శైలిలో స్పందించారు. మండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం తొందరపాటుతో కూడుకున్నదేనని గంటా అభిప్రాయపడ్డారు. ఎలాగూ ఓ ఏడాది ఓపిక పడితే... మండలిలో వైసీపీకే మెజారిటీ వస్తుందని, ఈ విషయాన్ని వైసీపీ నేతలు అంతగా గుర్తించినట్లుగా లేదని కూడా గంటా వ్యాఖ్యానించారు. రాజధాని బిల్లుపై మండలి చైర్మన్ వ్యవహరించిన తీరుకు టీడీపీ ఒత్తిడేనన్న వాదనలో నిజం లేదని చెప్పిన గంటా... మండలిలో టీడీపీకి మెజారిటీ ఉన్న విషయాన్ని అంతగా సీరియస్ గా తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

మొత్తంగా మండలి రద్దు దిశగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన గంటా... మూడు రాజదానుల విషయంలో మాత్రం జగన్ కే ఓటంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమే మరి... తమ ప్రాంతానికి రాజధాని వస్తుందంటే.. ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. ఓ ఎమ్మెల్యేగా, విశాఖలో ఏ స్థానం నుంచి అయినా గెలిచే సత్తా కలిగిన నేతగా ఉన్న గంటా కూడా అలాగే వ్యవహరిస్తారు కదా. అందులోనూ ఇప్పటికే విశాఖ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల నుంచి గంటా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూడా. మరి విశాఖకు వస్తున్న రాజధానిని వద్దని చెప్పి... ఆ నాలుగు నియోజకవర్గ ప్రజలకు గంటా దూరం కాలేరు కదా. అందుకే రాజధానుల విషయంలో తన ఓటు జగన్ కేనని గంటా బహాటంగానే ధైర్యంగానే చెప్పేశారు.



Tags:    

Similar News