ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో గౌతమ్ అదానీ

Update: 2022-07-20 03:30 GMT
ప్రపంచంలోని కుబేరుల జాబితాలో భారతీయ సంపన్నుడు, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతం అదానీ దూసుకెళ్లారు. ఏడాదిలోనే రికార్డ్ స్థాయిలో అతడి ఆస్తుల విలువ పెరగడంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను వెనక్కినెట్టి అదానీ 4వ స్థానానికి చేరుకున్నాడు.

ప్రపంచంలోనే అత్యధిక సంపాదన కలిగిన వారి జాబితాను తాజాగా ఫోర్బ్స్ రియల్ టైమ్ ప్రకటించింది. ఈ జాబితాలో 230 బిలియన్ డాలర్లతో  టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో నిలవగా.. రెండు మూడు స్తానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్డ్ , అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ లు నిలిచారు. నాలుగో స్థానంలో గౌతం అదానీ నిలిచారు.

ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబీకులతో సహా గౌతమ్ అదానీ మొత్తం సంపద దాదాపు 114 బిలియన్ డాలర్లు.  గతంలో నాలుగో స్థానంలో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్తాపకుడు బిల్ గేట్స్ ఉన్నారు. తాజాగా బిల్ గేట్స్ 20 బిలియన్ డాలర్లను గేట్స్ ఫౌండేషన్ కు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో ఐదో స్థానంకు పడిపోయారు. తన విరాళాలను క్రమంగా పెంచుతూ కుబేరుల జాబితా నుంచి తాను తప్పుకుంటానని ఇప్పటికే బిల్ గేట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక భారతీయ బిలియనీర్లలో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ జాబితాలో 10వ స్థానంకే పరిమితమయ్యారు. ప్రస్తుతం అంబానీ సంపద విలువ 88 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది.  ఈ ఏడాది ప్రారంభం వరకూ ఆసియాలో అత్యధిక ఆస్తులు కలిగిన వారి జాబితాలో ముఖేష్ అంబానీ తొలిస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ స్తానాన్ని గౌతమ్ అదానీ ఆక్రమించిన విషయం విధితమే.

2021-22 మధ్యకాలంలో అదానీ నికర విలువ 50 బిలియన్ డాలర్ల నుంచి 90 బిలియన్లకు పెరిగింది. దీంతో ఏడాది కాలంలోనే రికార్డ్ స్థాయిలో సంపద వృద్ధి చేసుకున్న వ్యక్తిగా గౌతం అదానీ రికార్డు సృష్టించారు.

అదానీ గ్రూపు కంపెనీలు రెండేళ్లుగా ఇన్ ఫ్రాపైనే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయి. ఇందులో గ్యాస్ పంపిణీ, విద్యుత్, ఓడరేవులు వంటి రంగాలున్నాయి. వీటిల్లో పెట్టుబడుల విలువ కొన్ని రెట్లు పెరిగింది. అదానీ గ్యాస్ అత్యధికంగా 1069శాతం పెరగడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో అదానీ ఎంటర్ ప్రైజెస్ 842శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌(715%), అదానీ గ్రీన్‌ ఎనర్జీ(442%), అదానీ పవర్‌(176%), అదానీ పోర్ట్స్‌(144%) ఉన్నాయి. మొత్తం మీద ఆరు కంపెనీలు కలిపి 420% మేర పైపైకి ఎగబాకాయి.
Tags:    

Similar News