పారిశుద్ధ్య పనులు కమిషనర్ చేయగలరా?

Update: 2015-07-16 11:46 GMT
రోడ్లపై చెత్త ఊడ్చడం.. మురుగు కాల్వను శుభ్రం చేయడం.. చెత్తను తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వేయడం.. రోడ్లను ఊడవడం.. ఒక్కసారి ఊహించండి.. ఇవి ఎంత కష్టమైన పనులో. ఇటువంటి పనులను మనం చేస్తే ఎంత ఇబ్బంది పడతామో. డంపింగ్ యార్డు లేక చెత్త పక్క నుంచి వెళితేనే మనం ముక్కు మూసుకుంటాం. అశుద్ధాన్ని చూస్తేనే అసహ్యించుకుంటాం. అటువంటిది రోజూ అక్కడే పని చేయాలి వాళ్లు. మరి అటువంటి వాళ్లకు కాస్త మంచి జీతాలు ఇస్తే తప్పు ఏమిటి? వాళ్ల జీవితమూ అధ్వానంగానే ఉండాలి. జీతాలూ అధ్వానంగానే ఉండాలా? కష్టమైన పని చేసే వాళ్లకు కాస్త మంచి జీతాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ వస్తున్న ప్రశ్న.

నిజానికి అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో ఇటువంటి పనులకు ఎక్కువ జీతం ఉంటుంది. అక్కడ సాఫ్ట్ వేర్ ఇంజనీరు కంటే కూడా డ్రైవరుకు ఎక్కువ జీతం ఉంటుంది. మన దగ్గర ప్రభుత్వాల పరిశుభ్రతకు పెద్దపీట వేసే సంప్రదాయం లేకపోవడంతో దానికి సంబంధించిన రంగంలోని ఉద్యోగుల జీతాలు కూడా తక్కువగానే ఉంటున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తే వారు చేసే పనులను ఆర్మీ, పోలీసులతో చేయిస్తానని కమిషనర్ సోమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మరి నిజంగా ఆయన కనీసం ఒక్కరోజు ఆ పని చేయించగలరా? కనీసం ఒక్క గంట ఆయన ఆ పని చేయగలరా? అయినా, పని ఆధారిత వేతనం లేకపోవడం వల్లనే మన దగ్గర ఈ దుస్థితి. దీనికితోడు పారిశుద్ధ్య పని చేసే వాళ్లను తక్కువగా చూడడం కూడా మరొక కారణం. వారిని తక్కువగా చూస్తాం కనక వారి జీతాలు కూడా తక్కువగానే ఉండాలనే దొరతనపు అభిప్రాయమిది. అందుకే వారి కనీసం వేతనాలు ఇవ్వడానికి కూడా ఇన్ని చర్చలు.. ఇన్ని తర్జనభర్జనలు.

మన రోడ్లు.. దాని పక్కన చెత్త కుప్పలు చూడండి ఎంత దారుణంగా ఉంటాయో. వాటిని పట్టించుకోవాలనే స్పృహ ప్రభుత్వానికి కానీ కమిషనర్లకు కానీ ఉండదు. దానివల్ల ఆరోగ్యాలు పాడవుతున్నా పట్టింపు ఉండదు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచి వారితో చక్కగా పని చేయించుకోవడానికి బదులుగా రోడ్లను చెత్తమయం చేస్తున్నారనే విమర్శః దాదాపు ప్రతి ఒక్కరి నుంచీ వెలువడుతోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పై ఆగ్రహం  కూడా వ్యక్తమవుతోంది. ఈ సమస్యకు ప్రభుత్వం ఎంత తొందరగా ముగింపు పలికితే అంత మంచిది.

Tags:    

Similar News