పారీక‌ర్ కు భార‌త‌ర‌త్న‌.. కార‌ణ‌మిదేన‌ట‌!

Update: 2019-03-25 04:54 GMT
సిగ్న‌ల్ ప‌డి ఉంది. ఒక మ‌ధ్య వ‌య‌స్కుడు స్కూట‌ర్ మీద గ్రీన్ సిగ్న‌ల్ కోసం ఎదురుచూస్తున్నాడు. వెనుక ఉన్న ఒక కుర్రాడికి చికాకుగా ఉంది. రెడ్ సిగ్న‌ల్ ప‌డితే మాత్రం.. ఆగాలా?  ఏమ‌య్యా ప‌క్క‌కు జ‌రుగు.. వెళ్లాల‌న్నాడు. ప‌ట్టించుకోన‌ట్లుగా ఉండిపోయాడా వ్య‌క్తి. కుర్రాడికి చిర్రెత్తుకొచ్చింది. నేనెవ‌రో తెలుసా?  మా నాన్న ఎవ‌రో తెలుసా? అంటూ ప‌ర‌ప‌తి లెక్క‌ల వ‌ద్ద‌కు వెళ్లాడు. కుర్రాడి మాట‌ల‌కు చిరున‌వ్వుతో.. నేను ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిని అంటూ బ‌దులిచ్చాడు.

ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి రోడ్డు మీద అతి సామాన్యుడి మాదిరి స్కూట‌ర్ మీద తిర‌గ‌ట‌మా? అంటే.. అది పారీక‌ర్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. సీఎంగా ఉన్నా.. మ‌రే అత్యుత్త‌మ ప‌ద‌విలో ఉన్నా అత్యంత సామాన్యుడిలా వ్య‌వ‌హ‌రించే తీరు పారీక‌ర్ కు మాత్ర‌మే చెల్లు. పాంక్రియాటిక్ కేన్స‌ర్ తో సుదీర్ఘ‌కాలం పోరాడిన ఆయ‌న‌.. ఆ పోరాటంలో మాత్రం ఓడిపోయారు. శాశ్విత నిద్ర‌లోకి జారి పోయారు.

నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపంగా క‌నిపించే పారీక‌ర్ కు ఘ‌న‌మైన నివాళి ఇవ్వాల‌ని  గోవా రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందుకు కేంద్ర స‌హ‌కారం తీసుకోవాల‌ని భావిస్తోంది. ప్ర‌తి ఏటా దేశ అత్యుత్త‌మ పుర‌స్కార‌మైన భార‌త‌ర‌త్న‌కు వ‌చ్చే ఏడాది మ‌నోహ‌ర్ పారీక‌ర్ పేరును సిఫార్సు చేయాల‌ని ఆ రాష్ట్ర సర్కారు భావిస్తోంది. పారీక‌ర్ కు భార‌త‌ర‌త్న పుర‌స్కారం ఇప్పించాల‌న్న‌ది గోవాకు ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న డాక్ట‌ర్ ప్ర‌మోద్ సావంత్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

దీనికి సంబంధించిన అధికార ప్ర‌క‌ట‌న ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డ‌కున్నా..  లాంఛ‌నంగా ఇప్ప‌టికే చ‌ర్చ‌లు షురూ అయిన‌ట్లుగాతెలుస్తోంది. మిత్ర‌ప‌క్షాల‌కు ఈ విష‌యాన్ని తెలియ‌జేయ‌కున్నా.. వారి నుంచి పెద్ద అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌నే భావిస్తున్నారు. ప్ర‌స్తుతం గోవాకు సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సావ‌త్‌.. దివంగ‌త పారీక‌ర్ కు అత్యంత స‌న్నిహితుడిగా పేరుంది. గోవా ముఖ్య‌మంత్రిగానే కాక‌.. కేంద్ర ర‌క్ష‌ణ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న వ్య‌క్తిత్వం ఎలాంటిదో దేశ ప్ర‌జ‌ల‌కు తెలిసిందే.

సింఫుల్ గా ఉంటూ త‌న ప‌నితీరుతో దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకున్న పారీక‌ర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వ‌టం ద్వారా దేశ ప్ర‌జ‌ల ఆమోదంతో పాటు.. నీతికి నిజాయితీకి గుర్తింపును ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని చెబుతున్నారు. పారీక‌ర్ కు భార‌త‌ర‌త్న ఇప్పించ‌టం ద్వారా త‌మ ప్ర‌భుత్వం మీద మ‌రింత పాజిటివ్ పెంచుకోవ‌టం కూడా ఒక ఆలోచ‌న‌గా చెబుతున్నారు. మిగిలిన రాజ‌కీయాలు ఎలా ఉన్నా.. పారీక‌ర్ లాంటి నేత‌కు భార‌త‌ర‌త్న పుర‌స్కారం ల‌భిస్తే.. అదో మంచి ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News