పట్టిసీమపై దృష్టి పెట్టండి బాబు

Update: 2015-10-16 07:16 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత తీసుకున్న రెండు ప్ర‌తిష్టాత్మ‌క నిర్ణ‌యాలు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ కు రాజ‌ధానిగా అమ‌రావ‌తి నిర్మాణం, ప‌ట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేయ‌డం. ప‌ట్టిసీమ ప్రాజెక్టు విష‌యంలో విజ‌యం సాధించిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి శంఖుస్థాప‌న విష‌యంలో శ‌ర‌వేగంగా ముందుకువెళుతున్నారు. అయితే ముంద‌రికాళ్ల‌కు బంధంలాగా పట్టిసీమ ప‌నులు అడ్డుప‌డుతున్నాయి. ప‌ట్టిసీమ‌ పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మార‌డం ఇపుడు ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బారుస్తోంది.

తొలిపంపు ద్వారా నీటిని విడుదల చేసి 24 గంటలు గడవకుండానే తమ్మిలేరుపై నిర్మించిన ఆక్విడెక్టు జాయింట్‌ భాగం కుప్పకూలింది. దీంతో తాడిపూడి ద్వారా విడుదల చేసిన నీరంతా దాదాపు రెండురోజులపాటు పట్టిసీమ మొదటి పంపు విఫ‌లం అవ‌డం వ‌ల్ల‌ తమ్మిలేరులోకి వృథాగా పోయింది. దీంతో నీటి విడుదలను నిలిపివేశారు. మ‌రోవైపు యుద్ధప్రాతిపదికన నిర్వహించిన అక్విడెక్టు జాయింట్‌ రిపేర్‌ పనులు నిష్ప్రయోజనమయ్యాయి. తాజాగా మళ్లీ లీకులు ఏర్పడటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

గ‌తంలో దాదాపు 25 రోజులపాటు రాత్రీపగలు పనిచేసి ఆక్విడెక్టు జాయింట్‌ ను పునరుద్ధరించారు. చైనా నుంచి తెచ్చిన మోటారు బిగింపు పూర్తిచేసి, తొలి పంపు నుంచి మళ్లీ 350 క్యూసెక్కుల నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. ఆక్విడెక్టు పైనుంచి కృష్ణాకు నీటి మళ్లింపు ప్రక్రియను అధికారులు చేపట్ట‌గా ఆక్విడెక్టు నుంచి మూడు చోట్ల నీరు లీకవుతోంది. దీంతో మరోసారి ఆక్విడెక్టుకు కూలుతుందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే 2,500 క్యూసెక్కుల నీరు ప్రవహించినా ఆక్విడెక్టుకు ఎటువంటి ఇబ్బందీ లేదని అధికారులు చెబుతున్నారు.  పట్టిసీమ పనుల నాణ్యతపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో రెండోసారి ఆక్విడెక్టు నుంచి నీరు లీకవడంపై సీఎం చంద్ర‌బాబు దృష్టిపెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News