ఈ గోల్డ్ బాబా ముచ్చ‌ట వింటే అవాక్కు అవ్వాల్సిందే

Update: 2017-07-24 17:30 GMT
అంద‌రూ బాబాలు ఒకేలా ఉండ‌రు. ఈ బాబా ముచ్చ‌ట తెలిసిన వెంట‌నే ఈ మాట‌ను ఎవ‌రైనా అనుకోవాల్సిందే. ఇహ‌ప‌ర‌మైన సుఖాల్ని వ‌దిలేసి.. ఒంటికి బూడిద రాసుకొనే స్వాములు.. బాబాల ఎడిష‌న్ పోయి చాలా కాల‌మే అయ్యింది. ఇప్పుడంతా గ్రాండ్ బాబాలు.. స్వాముల రాజ్యం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎంత గ్రాండ్ గా ఉంటే.. అంత సెల‌బ్రిటీగా మారే ప‌రిస్థితి. దేశంలో ఎంతోమంది బాబాలున్నా.. ఈ బాబా మాత్రం రేర్ ఎడిష‌న్ అని చెప్పాలి.

ఈ బాబా ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఒంటి మీద క‌నీసం ప‌దిహేను కిలోల వ‌ర‌కూ బంగారం వేసుకోకుండా బ‌య‌ట‌కు రారు. బంగారం మీద బాబాకు ఉన్న మ‌క్కువ అంతా ఇంతా కాదు. ఏదో ప్రోగ్రామ్‌ కి త‌ట్టెడు బంగారం ఒంటి మీద వేసుకురావ‌టం ఒక ఎత్తు. కానీ.. ఈ బాబాకు గోల్డ్ మీద ఎంత ఆపేక్ష అంటే.. 200 కిలోమీట‌ర్లు సాగే యాత్ర‌లోనూ ఇంతే భారీగా గోల్డ్ ధ‌రించ‌టం ఆయ‌న‌కే చెల్లుతుంది.

హ‌రిద్వార్ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ 200 కిలోమీట‌ర్లు సాగే క‌న్వ‌ర్ యాత్ర ప్ర‌తి ఏటా సాగుతుంటుంది. దీనికి పెద్ద ఎత్తున యాత్రికులు పాల్గొంటుంటారు. అయితే.. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు ఈ యాత్ర‌లో పాల్గొన్న సుధీర్ మ‌క్క‌ర్ అనే ఈ బాబా మాత్రం మీడియా దృష్టిని తెగ ఆక‌ర్షిస్తుంటారు. మెడ‌లో 21 బంగారు చైన్ల‌తో పాటు.. దేవుడి లాకెట్లు ఉన్న మ‌రో 21 ఆభ‌ర‌ణాల్ని ఎప్పుడూ ధ‌రిస్తుంటారు. అప్పుడ‌ప్పుడు బంగారు జాకెట్ ధ‌రించి త‌న ఎస్ యూవీ మీద కూర్చొని.. త‌న‌కు తోడుగా మ‌రో 16 మందిని బైకుల మీద ర్యాలీగా తీసుకెళ్ల‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లుతుంది. గ‌త ఏడాది 12.5 కిలోల బంగారాన్ని ఒంటి మీద వేసుకొని తిరిగిన ఆయ‌న‌.. ఈ ఏడాది మ‌రో రెండు కేజీల బంగారాన్ని ధ‌రించి మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు.

ఈ బంగారు బాబాకు ఆస్తుల‌కు.. ఆభ‌ర‌ణాల‌కు కొద‌వ‌లేదు. రోలెక్స్ వాచీ.. బీఎండ‌బ్ల్యూ కారు.. రెండు ఆడిలు.. మూడు ఫార్చూన‌ర్లు ఉన్నాయి. ఒంటి మీద ఉన్న 14.5 కేజీల బంగారం కాకుండా చాలానే ఆభ‌ర‌ణాలు ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్న‌ట్లుగా భ‌క్తులు చెబుతుంటారు. శివుడి లాకెట్ తో కూడిన కొత్త చైన్ ఒక్క‌టే రెండు కేజీల బ‌రువు ఉంటుంద‌ట‌. అయితే.. తాజా యాత్ర‌లో ఆ లాకెట్‌ను ధ‌రించ‌లేద‌ని చెబుతారు గోల్డ్ బాబా. ఎందుకంటే.. 200 కిలోమీట‌ర్ల సుదీర్ఘ యాత్ర‌కు రెండు కేజీల గొలుసు ధ‌రిస్తే మెడ న‌రాలు లాగేసే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే ఆ భారీ గొలుసును ధ‌రించ‌లేద‌ని చెబుతున్నారు. అందుకే.. తాజా యాత్ర‌లో ఎక్కువ బంగారాన్ని ధ‌రించ‌టం లేద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఏడాది నిర్వ‌హించే యాత్ర చివ‌రిద‌ని.. దాంతో 25వ సారి యాత్ర చేసిన‌ట్లు అవుతుంద‌ట‌. మ‌రి.. చివ‌రి యాత్ర‌కు మ‌రెంత భారీగా బంగారాన్ని వేసుకొని చేస్తారో చూడాలి. 
Tags:    

Similar News