విద్యా దీవెన నిధులు.. జగన్ సర్కార్ కు హైకోర్టులో ఊరట

Update: 2021-12-28 04:25 GMT
ఏపీలోని జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకూ హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రతి నిర్ణయంపై ప్రతిపక్షాలు.. కొందరు మేధావులు హైకోర్టుకు ఎక్కడంతో అది ఎప్పటికప్పుడు స్టేలతో ఆగిపోతూనే ఉంది. అయితే చాలా రోజుల తర్వాత జగన్ సర్కార్ కు హైకోర్టులో ఊరట లభించింది. తాజాగా కీలక పథకాలకు సంబంధించి హైకోర్టులో ఏపీ సర్కార్ కు సానుకూల నిర్ణయం వెలువడింది.

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బుల జమపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఆ నిధులను తల్లుల ఖాతాల్లో వేయాలన్న సర్కార్ నిర్ణయంపై సానుకూలంగా స్పందించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల్లో భాగంగా లబ్ధిదారులకు ఇచ్చే సొమ్ము కళాశాల ఖాతాల్లో జమ చేయాలని సింగిల్ జడ్జి బెంచ్ ఇటీవల తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.

కళాశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన పథకం కింద చెల్లించే బోధన రుసుములను (ఫీజు రీయింబర్స్ మెంట్) వారి తల్లుల ఖాతాల్లో జమ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇక నుంచి విద్యార్థుల తరుఫున సొమ్మును కళాశాలల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించింది. తల్లుల ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పించే జీవో 28ని రద్దు చేసింది. మరో జీవో 64లోని నిబంధనలను కొట్టేసింది.

తల్లుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేసిన నగదును కళాశాలలకు చెల్లించేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉండదని పేర్కొంది. ఆయా కళాశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో జమ చేసిన సొమ్మును 40శాతం మంది కళాశాలలకు చెల్లించలేదని గుర్తు చేసింది. దీంతో కళాశాలలు చదువు చెప్పలేవని తెలిపింది. తల్లులు రుసుము చెల్లించకపోతే ఆ విద్యార్థి కళాశాలలో కొనసాగే అంశంపై జీవోలో పేర్కొనలేదని ఆక్షేపించింది. విద్యార్థులు దీనిద్వారా మధ్యలోనే చదువు ఆపేసే ప్రమాదం ఉందని సింగిల్ జడ్జి పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే తల్లుల ఖాతాలో ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము జమ చేసేందుకు వీలు కల్పిస్తున్న జీవోలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీ తీర్పునిచ్చారు.

ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు సవాల్ చేసింది. విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై 2 వారాల స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటివరకూ తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయవచ్చని పేర్కొంది. దీంతో ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్టైంది.
Tags:    

Similar News