అమెరికా వెళ్లాలనుకునే భారత విద్యార్థులకు శుభవార్త!

Update: 2022-10-30 05:15 GMT
అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. అమెరికా ప్రభుత్వం భారీ సంఖ్యలో స్టూడెంట్‌ వీసా ఎఫ్‌-1 స్లాట్లను వదిలింది. అమెరికన్‌ కాన్సులేట్లు ఉన్న ఢిల్లీతోపాటు చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్‌కతాల్లో ఎఫ్‌–1 వీసా స్లాట్లు విడుదలయ్యాయి.

అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి అనుగుణంగా తాజాగా భారత విద్యార్థుల కోసం అమెరికా ప్రభుత్వం ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాల స్లాట్లను విడుదల చేసింది.

కాగా.. అమెరికాలో ఈ ఏడాది జూలై, ఆగస్టుతో ముగిసిన విద్యా సంవత్సరంలో దాదాపు 82 వేల మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్‌-1 వీసాలను ఆ దేశం జారీ చేసింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో భారతీయ విద్యార్థులకు అమెరికా ఇంత భారీ మొత్తంలో వీసాలు ఇవ్వడం ఇదే మొదటిసారి.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి ప్రవేశాల కోసం విడుదల చేసిన తాజా స్లాట్లలోనూ భారతీయ విద్యార్థులకు భారీగానే ఎఫ్‌-1 వీసాలు దక్కొచ్చని భావిస్తున్నారు.  

ఈ నేపథ్యంలో వీసాల జారీలో చోటు చేసుకుంటున్న జాప్యాన్ని నివారించేందుకు అమెరికా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించింది. వీరి ఇంటర్వ్యూ అధికారులుగా ఇటీవల ఇండియాకు పంపింది. తాజాగా వారు కాన్సులేట్‌ ఆఫీసుల్లో విధుల్లో చేరారు. దీంతో అక్టోబర్‌ 29న ఎఫ్‌-1 వీసాల కోసం భారీగా స్లాట్లు విడుదల చేసింది.

కాగా, స్లాట్లు విడుదలైన క్షణాల్లోనే నవంబర్‌ నెల కోటా పూర్తికావడం విశేషం. ఈ నేపథ్యంలో నవంబర్‌ రెండో వారంలో మరో దఫా మరికొన్ని స్లాట్లు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇలా రెండు దఫాలుగా స్లాట్లు విడుదల చేస్తామని ఢిల్లీలోని యూఎస్‌ ఎంబసీలో మినిస్టర్‌ కాన్సులర్‌ డాన్‌ హెప్లిన్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా ఎఫ్‌-1 వీసాల ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్‌ ఒక్కసారిగా వెల్లువెత్తడంతో సంబంధిత వెబ్‌సైట్లు స్తంభించాయి.
Tags:    

Similar News