కూతురి కోసం క్లీన్ ఇమేజి వ‌దులుకుంటున్న ఎమ్మెల్యే

Update: 2017-07-05 07:44 GMT
తెలుగు రాజ‌కీయాల్లో మ‌చ్చ‌లేని చ‌రిత్ర ఉన్న అతికొద్ది మంది నేత‌ల్లో ఆయ‌న కూడా ఒక‌రు. న‌చ్చినా - మెచ్చినా - కోపమొచ్చినా ఏదీ మ‌న‌సులో దాచుకోకుండా వ్య‌క్తీక‌రించే నేత ఆయ‌న‌.  పార్టీలు మార‌డం - వ‌ర్గ రాజ‌కీయాలు - ప‌నిగ‌ట్టుకుని క‌క్ష సాధించ‌డం వంటివ‌న్నీ ఆయ‌న నైజానికి విరుద్ధం. పైగా ఘ‌న‌మైన వార‌స‌త్వం. అందుకే మొద‌టి నుంచి టీడీపీలోనే ఉన్న ఆయ‌న్ను ఎన్టీఆర్ నుంచి చంద్ర‌బాబు వ‌ర‌కు అంతా అభిమానిస్తారు. కానీ... ఇంత‌వ‌ర‌కు మంత్రి ప‌ద‌వి మాత్రం ఇవ్వ‌లేదు. ఆయ‌న‌కు ఆ అసంతృప్తి ఎప్ప‌టి నుంచో ఉంది. ఆయ‌నే ప‌లాస ఎమ్మెల్యే గౌతు శ్యామ‌సుంద‌ర శివాజీ.

ఇన్నిసార్లు గెలిచినా, ఇంత సీనియార్టి ఉన్నా కూడా మంత్రి ప‌ద‌వి రాలేద‌న్న బాధ ఉన్న ఆయ‌న రాజ‌కీయాల్లో త‌న స్థానాన్ని త‌న కుమార్తె భ‌ర్తీ చేయాల‌ని కోరుకుంటున్నారు. ఇప్ప‌టికే కుమార్తె శిరీష‌ను ప్ర‌జ‌ల్లోకి తేగ‌లిగారు. ప్ర‌స్తుతం ఆమె శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్య‌క్షురాలిగా ఉన్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌నకు బ‌దులు త‌న కుమార్తెకు ప‌లాస ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించుకోవాల‌న్న‌ది శివాజీ కోరిక‌. కానీ, కొద్దికాలంగా ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు స్థానిక నేత‌లు కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఈ అజాత శ‌త్రువుకు వారితో విభేదాలు మొద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలో కుమార్తె రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం ఆయ‌న ఎన్న‌డూ త‌న‌కు అలవాటు లేని విధానాల‌కు, రాజ‌కీయ క‌క్ష‌ల‌కు దిగుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు అవ‌త‌లి వ‌ర్గం నుంచి వినిపిస్తున్నాయి. త‌న‌ను వ్య‌తిరేకిస్తున్న వారిని కేసుల్లో ఇరికిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజా ప‌రిణామాలు అందుకు ఉదాహ‌ర‌ణ అని అంటున్నారు. అల్లుడి ఒత్తిడితో శివాజీ ఇదంతా చేస్తున్నార‌ని అంటున్నారు.

ఎమ్మెల్యే శివాజీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లాస మున్సిపాలిటీ కీల‌క ప్రాంతం. జీడిప‌ప్పు వ్యాపారానికి ఈ ఊరు అంత‌ర్జాతీయంగా పేరున్న ప్రాంతం. అంతేకాదు.. ఒడిశా స‌రిహ‌ద్దుల్లో ఉన్న ఒక మోస్త‌రు ప‌ట్ట‌ణం కావ‌డం - రైలు - హైవే క‌నెక్టివిటీ ఉండ‌డంతో అన్ని ర‌కాల వ్యాపారాలు కూడా భారీగా జ‌రుగుతాయి. ప‌లాస కేంద్రంగా ఒడిశా - జార్ఖండ్ ల‌కు స‌న్న‌ర‌కాల బియ్యం ఎగుమ‌తి అవుతుంది. స‌మీపంలోనే ఉద్దానం ఉండ‌డంతో కొబ్బ‌రి - ప‌న‌స‌ - జీడి వంటి అన్ని ర‌కాల వ్యాపారాల‌కూ ఇది కేంద్రం. ఈ మున్సిపాలిటీకి చైర్మ‌న్ గా ఉన్న కోత పూర్ణ‌చంద్ర‌రావు ను తాజాగా పేకాట కేసులో పోలీసులు అరెస్టు చేయ‌డంతో ఇక్క‌డి రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌న్నీ టీడీపీలో చ‌ర్చ‌నీయం అవుతున్నాయి. ఇది కుల రాజ‌కీయాల మ‌లుపు కూడా తిరుగుతోంది.

పూర్ణ‌చంద్ర‌రావు అరెస్టు వెనుక శివాజీ - శిరీష‌ల ఒత్తిడి ఉన్న‌ట్లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. శివాజీ రాజకీయాలకు దూర‌మైతే తాము అవకాశం ద‌క్కించుకోవాల‌ని ఆశ పెట్టుకున్న‌వారిలో పూర్ణ‌చంద్ర‌రావు ప్ర‌థ‌ముడు. గత రెండేళ్లలో తరచుగా అనారోగ్య కారణాల వల్ల సమావేశాలకు హాజరుకాలేకపోతున్న శివాజీ స్థానంలో పలు కార్యక్రమాలను ఎంపీపీలు - మున్సిపల్‌ చైర్మన్ పూర్ణ చంద్ర‌రావు నిర్వహిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌నకు ఈ కోరిక క‌లిగింద‌ని చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో పూర్ణచంద్రరావు వచ్చే ఎన్నికలలో పలాస సీటు తన‌దేన‌ని అక్క‌డా ఇక్క‌డా అన‌డం... అది శివాజీ వ‌ర‌కు చేర‌డం జ‌రిగాయి. అంతేకాదు... తాను మంత్రి ప‌దవి ఆశిస్తుండ‌గా త‌న‌కు కాకుండా చంద్ర‌బాబు శ్రీకాకుళానికే చెందిన క‌ళావెంక‌ట‌రావుకు ప‌ద‌వి ఇవ్వ‌డం శివాజీని బాధించింది.. ఇప్పుడు పూర్ణ‌చంద్ర‌రావు క‌ళాకు చేరువ‌వుతుండ‌డం... క‌ళా ద్వారా చిన‌బాబు లోకేశ్ వ‌ద్ద‌కు పూర్ర‌ణ‌చంద్ర‌రావు వెళ్ల‌డంతో శివాజీ అప్ర‌మ‌త్త‌మ‌య్యార‌ని తెలుస్తోంది. తన కుమార్తె శిరీషను పలాస నియోజకవర్గంలో రాజకీయ కార్యక్రమాలకే గాకుండా అధికారిక కార్యక్రమాలకు పంపడం ప్రారంభించారు. ఈ విషయంలో ప్రోటోకాల్‌ నిబంధనలను సైతం ఉల్లంఘించడానికీ వెనుకాడలేద‌ని చెప్తున్నారు. దీంతో పూర్ణ చంద్ర‌రావు, మ‌రికొంద‌రు ద్వితీయ శ్రేణి నేతలు కూడా శివాజీకి వ్య‌తిరేకంగా డైరెక్టుగానే పావులు క‌దిపార‌ని స‌మాచారం. ఇది ముదిరి పోలీసు కేసుల వరకూ వెళ్లింద‌ని అంటున్నారు.

సొంతంగా వ‌ర్గం పెంచుకుంటున్న చైర్మ‌న్ పూర్ణ చంద్ర‌రావు శివాజీతో అనేక విష‌యాల్లో విభేదిస్తున్నారు. దీంతో పూర్ణ‌చంద్ర‌రావుకు చెక్ పెట్టేందుకు త‌న‌కు న‌మ్మ‌క‌స్తుడైన పిళ్లా జగన్‌మోహన్‌రావు అనే అధికారికి ప్ర‌త్యేక జీవో తెచ్చి మ‌రీ పలాస మున్సిపల్‌ కమిషనర్‌ గా తెచ్చారు శివాజీ .  అక్క‌డి నుంచి కమిషనర్‌ కు - చైర్మన్‌ కు మధ్య నిత్యం గొడ‌వ‌లే. చివరకు శివాజీ ప‌లాసలో లేని స‌మ‌యం చూసి క‌మిష‌న‌ర్ పై చైర్మ‌న్ - ఆయ‌న మ‌నుషులు దాడి చేశారు. దీనిపై కమిషనర్‌ కేసు పెట్టడంతో చైర్మ‌న్ పూర్న‌చంద్ర‌రావు చాలాకాలం ప‌రారీలో వెల్లిపోయారు. ఈ సందర్భంలోనే చైర్మ‌న్ కు అనుకూలంగా ఉండే మ‌రికొంద‌రు కౌన్సిల‌ర్లు, కౌన్సిల‌ర్ల భ‌ర్త‌ల‌పైనా కేసులు నమోదయ్యాయి.

అయితే చైర్మ‌న్ రీసెంటు గా  బెయిల్ సంపాదించుకుని మ‌ళ్లీ జ‌నాల్లోకి వ‌చ్చారు. కానీ... అతికొద్ది రోజుల్లోనే మళ్లీ పేకాట కేసులో దొరికిపోయారు. దీనివెనుక ప‌క్కా స్కెచ్ ఉంద‌ని అంటున్నారు. చైర్మ‌న్ హోదాలో ఉన్న వ్య‌క్తి పేకాట ఆడ‌డం త‌ప్పే అయినా ఆయ‌న్ను పట్టించింది టీడీపీ జిల్లా అధ్య‌క్సురాలు, ఆమె తండ్రి అయిన ఎమ్మెల్యే శివాజీలేన‌ని... ఇది పార్టీ ప‌రువును తీసింద‌ని అంటున్నారు.

ఒక్క చైర్మ‌నే కాదు, చైర్మ‌న్ కు మ‌ద్దుత‌గా ఉన్న అంద‌రిపైనా కేసులు న‌మోద‌వుతున్నాయి. పలాస మున్సిపల్‌ సమావేశాల్లో కౌన్సిల‌ర్ పాతాళ ముకుందరావు చైర్మన్ కు స‌పోర్టుగా ఉంటూ ఇటీవల సర్వసభ్య సమావేశంలో కమిషనర్‌ను నిలదీశారు. కమిషనర్‌కు శివాజీ మద్దతుగా నిలిచారు.  ఆ త‌రువాతా మూడు రోజులకే ముకుందరావుపై పాత కేసులను తిరగేసి పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల బూత్‌ వద్ద గలాటా చేశాడని, అంబులెన్స్‌లో నాటుసారా రవాణా కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడంటూ పోలీసులు పాత కేసుల‌న్నీ బ‌య‌ట‌కు తీసి ఆయ‌న్ను లోప‌లేశారు. అలాగే.. సోష‌ల్ మీడియాలో త‌న‌కు వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతున్న నేత‌పైనా కేసులు వేయించారు శివాజీ. కోఆప్షన్‌ సభ్యురాలు లక్ష్మీ ప్రధాన్‌ భర్త బుల్లు ప్రధాన్  స్థానిక సమస్యలపై వాట్సాప్, ఫేస్‌బుక్‌ ద్వారా పోస్టులు పెట్టడం మొదలెట్టారు. శివాజీకి వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతుండ‌డంతో బుల్లు ప్రధాన్‌పై కేసు నమోదైంది.

కూతురి రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసమే శివాజీ ఇలా చేస్తున్నార‌ని.. శివాజీని ఇంత‌కుముందెన్న‌డూ ఇలా చూడ‌లేద‌ని ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం అంటోంది. ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా మంచివారే అయినా కుమార్తె శిరీష‌, అల్లుడు వెంక‌న్న చౌద‌రిలు ఆయ‌న‌పై ఒత్తిడి చేసి తాము చెప్పిన‌ట్లు ఆడిస్తున్నార‌ని... దీంతో అజాత‌శ‌త్రువులాంటి శివాజీని వ్య‌తిరేకించాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు.


Tags:    

Similar News