పెద్దాయన మాట వింటే నాయకులకు గుండె దడే!

Update: 2016-10-06 04:53 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులకు ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే.. ముందు గవర్నర్‌ నరసింహన్‌ వద్దకు వెళ్లిపోతూ ఉంటారు. తమ రాజకీయ ప్రత్యర్థుల మీద గవర్నర్‌ కు ఆరోపణలు చేసేసి... ఆయన చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేసేస్తారు. ఆయన తన పరిధి ఎరిగి మిన్నకుంటే గనుక, గవర్నర్‌ పట్టించుకోలేదని, ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని.. నిరాధార నిందలు వేసేస్తారు. గవర్నర్‌ నరసింహన్‌ ఆ నిందలన్నీ ఎలా భరించారో గానీ.. ఆయనకు నాయకుల తీరు మీద చాలా ఆగ్రహమే ఉన్నట్లుంది.

ఎన్నికల సంఘం అధికార్ల సమావేశం హైదరాబాదులో జరిగితే, దాన్ని ప్రారంభిస్తూ.. నాయకులను పదవిలోంచి దించేసే హక్కు కూడా ప్రజలకు ఉండాలంటూ గవర్నర్‌ నరసింహన్‌ కొత్త డిమాండును తన మాటగా తెరపైకి తెచ్చారు.
సాధారణంగా మేధావులు - ప్రజాఉద్యమాలు చేసే వారినుంచి ఇలాంటి డిమాండ్‌ తరచుగా వినిపిస్తుంటుంది. నిర్ణయాలు చేసేది నాయకులే గనుక.. దీన్ని పట్టించుకోకుండా నెట్టేస్తుంటారు. కానీ.. ఏకంగా గవర్నర్‌ స్థాయిలో రాజ్యాంగబద్ధమైన వ్యక్తి.. ఎన్నికల సంఘం అధికార్ల సమావేశంలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయడం పెద్ద విషయం. నాయకులను రీకాల్‌ చేసే హక్కు ప్రజలకు ఉండాలంటూ గవర్నర్‌ చెబుతున్న మాటలను వింటే నాయకులకు గుండెదడ తప్పదని జనం అనుకుంటున్నారు.

ఎందుకంటే.. జనానికి ఎన్నికల వేళ ఏదో మాయమాటలు చెబుతూ ఉంటారు తప్ప.. మాట మీద నిలబడేనాయకులు ఎంత మంది ఉంటారో అందరికీ తెలుసు. అందుకే దాదాపుగా అందరు నేతలకూ ఇలాంటి డిమాండ్లు బెదురు పుట్టిస్తాయని జనం భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News