ఎవ‌రు చెప్పార‌ని పుస్తెలు తీయించారు? గ‌వ‌ర్న‌ర్ ఫైర్

Update: 2018-09-18 05:06 GMT
గ‌వ‌ర్న‌ర్ కు కోపం వ‌చ్చింది. అది కూడా.. అలాంటి ఇలాంటి కోపం కాదు. పేప‌ర్ల‌లో వ‌చ్చిన వార్త ఆయ‌న్ను క‌దిలించేసింది. వీఆర్వో రాత ప‌రీక్ష సంద‌ర్భంగా ప‌రీక్ష రాసేందుకు వ‌చ్చిన మ‌హిళా అభ్య‌ర్థుల మెడ‌లోని పుస్తెల తాడు తీస్తే కానీ ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌మ‌న్న తీరుపై గ‌వ‌ర్న‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం ఎవ‌రు?  బాధ్య‌త ఎవ‌రిది? ఇవ్వాలంటూ తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ను ఆదేశించిన‌ట్లుగా తెలుస్తోంది. అంతే కాదు.. ఈ ఉదంతంపై త‌న‌కు వెంట‌నే నివేదిక పంపాల‌ని ఆదేశించారు. దీంతో.. క‌మిష‌న్ స్పందించి.. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేద‌ని.. ప‌రీక్షా కేంద్రాలే దీనికి బాధ్యుల‌ని తేల్చింది.

మ‌హిళ‌ల చేత తాళిబొట్లు తీయించి ప‌రీక్ష‌హాల్లోకి అనుమ‌తించిన వైనంపై టీఎస్సీఎస్సీ కార్య‌ద‌ర్శి వాణీప్ర‌సాద్ స్పందించారు. మ‌హిళా అభ్య‌ర్థులు మంగ‌ళ‌ సూత్రాలు తీసి రావాల‌నే నిబంధ‌న‌ను తాము విధించ‌లేద‌న్నారు. మెద‌క్ జిల్లా న‌ర్పాపూర్ లోని ఓ ప‌రీక్షా కేంద్రంలో పుస్తెల‌తాడు తీసి రావాలంటూ సిబ్బంది ఆదేశించిన వైనంపై వార్త‌లు వ‌చ్చిన వెంట‌నే స్పందించిన‌ట్లు చెప్పారు. విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌న్నారు.

ఇదిలా ఉంటే.. మంగ‌ళ‌సూత్రాలు తీయించి ప‌రీక్ష హాల్లోకి అనుమ‌తించిన దుర్మార్గ ఉదంతాలు మొత్తం నాలుగు చోట్ల మాత్ర‌మే జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతంపై ప‌లువురు మాన‌వ‌ హ‌క్కుల సంఘాన్ని ఆశ్ర‌యించారు. ఏమైనా ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన ఈ వార్త‌పై గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహావ‌తారం ఎత్త‌టంతో ఈ మాత్రం వివ‌ర‌ణ వ‌చ్చింది కానీ.. లేకుంటే దీనిపై స్పందించే నాథుడే ఉండేవాడు కాడ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News