అది 1990 ల నాటి కాలం.. డిగ్రీ చదవడమే గొప్ప.. అందునా సైన్స్ గ్రూపు నుంచి పాసయ్యాడంటే అతడో మేధావి అని అనేవారు.. ఇక 2000 సంవత్సరానికి డిగ్రీ ఈజీ అయిపోయింది. పీహెచ్.డీ చేసే వారిని అపర మేధావిగా పేర్కొనేవారు.. ఎక్కువగా టీచర్లు - లెక్చరర్లు మాత్రమే ఈ పీహెచ్.డీలు చేసేవారు.. ఏదైనా కవులు - రచనలు - సామాజిక అంశం - కొత్త ఆవిష్కరణల మీద పరిశోధనలు చేసి సొంతంగా కష్టపడి పీహెచ్.డీ పట్టా పొందేవారు..ఇదంతా గతం..
ఇప్పుడు పీహెచ్.డీ చేయడం చాలా ఈజీ.. ఏదైనా సరే చిటెకలో వచ్చిపడుతున్నాయి. ఒక అంశాన్ని తీసుకొని కాళ్లు అరిగేలా తిరగాల్సిన అవసరం లేదు.. కేవలం కంప్యూటర్ ముందర కూర్చొని గూగుల్ తల్లిని ఓపెన్ చేస్తే చాలు .. చిటెకలో సమాచారం లభిస్తోంది. దీంతో దాన్నంతా కాపీ చేసి డీటీపీ ఆపరేటర్లతో కొట్టించేసి పీహెచ్.డీ పరిశోధన చేశామంటూ యూనివర్సిటీలకు సమర్పిస్తున్నారు. ఇది చూసిన ప్రొఫెసర్ లో అబ్బో బాగా కష్టపడ్డారంటూ డాక్టరేట్ లు ఇస్తున్నారు. ఇందులో భారీగా డబ్బులు చేతుమారుతున్నాయన్నది జగమెరిగిన సత్యమే.. పీహెచ్.డీలు రాసిచ్చేందుకు పలువురు టీచర్లు - లెక్చరర్లు దుకాణాలు కూడా ఏర్పాటు చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు..
ఇదో మూసధోరణి.. పెద్దగా కష్టపడకుండానే డాక్టరేట్ లు కొట్టేస్తున్నారు.. ఈ ధోరణి తెలిసే రాష్ట్ర గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో యూనివర్సిటీ నుంచి వందల సంఖ్యలో పీహెచ్.డీలు ఇస్తున్నారని.. ఇలా డబ్బులు వెదజల్లి పరిశోధనలను రాయించుకొచ్చి చేసే పీహెచ్.డీలు అవసరమా అని గవర్నర్ నిలదీశారు. కనీసం లేఖ రాయడమైనా వస్తుందా వారికి.. అంతమందికి ఆచార్యులు గైడ్ ఎలా చేయగలుగుతున్నారు.. అంత సమయం ఎలా వెచ్చిస్తున్నారు.. ఇదంతా ఓ అక్రమ పీహెచ్.డీలే’ అంటూ వాపోయారు..
నిజానికి ఎన్నో విషయాలకు పట్టుబట్టి మరీ చక్కదిద్దిన కేసీఆర్ చదువుల విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. విద్యా - ఉద్యోగ - ఉపాధి విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యం బయటపడుతోంది. గురుకులాలతో చదువులను దారికి తెచ్చినా ఉద్యోగ కల్పనలు - యూనివర్సిటీల బాధలు తీర్చడంలో విఫలమవుతున్నారు. బహుశా మేధావి వర్గమైన ఉద్యోగులు - విద్యార్థులతో పెట్టుకుంటే తనకు ఎసరు వస్తుందని కాబోలు.. ఆయన విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు సెటైర్లు వేస్తున్నారు.