ఆర్బీఐ గవర్నరు జీతం అంతేనా?

Update: 2016-04-25 04:43 GMT
భారత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌ బీఐ) గవర్నర్‌ అంటే కీలక పదవి... మరి అలాంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి జీతం ఎంత ఉండొచ్చు...? రిజర్వు బ్యాంకులో ఆయనదే అధిక వేతనమా? చాలామందికి ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. అలాంటి సందేహాలకు సమాచార హక్కు చట్టం సమాధానం చెబుతోంది. సమాచార హక్కు చట్టం ప్రకారం ఆర్ బీఐ వెబ్ సైట్ లో ఆ ఉద్యోగుల జీతభత్యాలను వెల్లడించారు. ఆ సమాచారం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే పలువురు ఎగ్జిక్యూటివ్ ల కంటే ఆయన జీతం చాలా తక్కువట.
   
ఆర్ బీఐ గవర్నరుగా రఘురాం రాజన్‌కు విశేషాధికారాలు ఉండొచ్చు. కానీ, సెంట్రల్‌ బ్యాంకులోని ఇతర ఎగ్జిక్యూటివ్‌ లతో పోల్చుకుంటే ఆయన వేతనం మాత్రం చాలా తక్కువే. సమాచారం చట్టం కింది ఆర్‌ బీఐ ఈ వివరాలను వెల్లడించింది. ఇక రాజన్‌ వేతనం విషయానికి వస్తే ఆయనకు నెలవారి వేతనం రూ.1,98.700... అందులో బేసిక్‌ రూ.90,000 - కరువుభత్యం రూ.1,01,700 - ఇతర భత్యాలు రూ.7,000గా ఉన్నాయి. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రాజన్‌ కంటే నెల నెలా ఎక్కువ వేతనాలు తీసుకునే వారు కనీసం ముగ్గురున్నారు. వారు గోపాలకృష్ణ సీతారాం హెగ్డే (రూ.4 లక్షలు) - అన్నామలై అరాప్పులి గౌండర్‌ (రూ.2,20,355) - వి కందస్వామి (రూ.2.1 లక్షలు).   వీరిలో హెగ్డే సెంట్రల్‌ బ్యాంకు ప్రిన్సిపల్‌ లీగల్‌ అడ్వయిజర్‌ (ప్రధాన న్యాయసలహాదారు)గా వ్యవహరించారు.
   
సమాచారం చట్టం (ఆర్‌ టిఐ) కింద ప్రభుత్వ అధికారులు - ఉద్యోగుల నెలవారి వేతనాలు - భత్యాల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.  రిజర్వు బ్యాంకు గవర్నర్‌ డాక్టర్‌ రఘురాం రాజన్‌ విషయానికి వస్తే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)లో ప్రధాన ఆర్థికవేత్తగా గతంలో పనిచేశారు. షికాగో బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ లో ఆయన లీవ్‌ ప్రొఫెసర్‌ ఫైనాన్స్‌ గా పనిచేశారు. మూడు సంవత్సరాల క్రితం ఆయన ఆర్‌ బీఐ గవర్నర్‌ గా చేరారు. ఆయన కాలపరిమితి ఈ ఏడాది సెప్టెంబర్‌ తో ముగస్తుంది. అత్యున్నత ఆర్థిక సంస్థకు అధిపతిగా ఉన్న వ్యక్తి జీతం దేశంలోని చాలా ప్రయివేటు సంస్థల ఉన్నత ఉద్యోగుల జీతాల కంటే బాగా తక్కువ ఉండడం ఆశ్చర్యకరమే మరి.
Tags:    

Similar News