నరసింహన్ చేయని పని చేస్తున్న తమిళ సై!

Update: 2019-10-22 04:46 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుదీర్ఘకాలం గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ ఉన్నంత కాలం రాష్ట్రానికి పెద్దాయనగా ఉన్నప్పటికీ.. తన పరిధి దాటి పక్కకు వెళ్లింది లేదు. ప్రజాసమస్యలపై స్పందించే విషయంలో మరో దుకాణాన్ని తెరిచి.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది లేదు. ఏదైనా మనసులో బాధ కలిగితే.. తాను పాల్గొన్న సభల్లో వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపటంలో మాత్రం వెనక్కి తగ్గే వారు కాదు. అంతే తప్పించి.. పాలనపరంగా ప్రభుత్వాన్ని ఓవర్ టేక్ చేయాలన్న ఉత్సాహం అస్సలు ఉండేది కాదు.

అయితే.. ఆయన స్థానంలో గవర్నర్ గా వచ్చిన తమిళ సై ఎంపిక మర్మం అందరికి తెలిసిందే. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరించే ఆమెను.. ఏరికోరి మరీ తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా ఎంపిక చేయటంతోనే.. కేంద్రం ఏం కోరుకుంటుందన్న విషయం మీద క్లారిటీ వచ్చేసినట్లే. వారి అంచనాలకు తగ్గట్లే తమిళసై వ్యవహరిస్తున్నారని చెప్పాలి.

ఇప్పటికే ప్రధాని మోడీతో భేటీ అయిన ఆమె ఏకంగా నలభై నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల గురించి.. ఇతరత్రా కార్యక్రమాల గురించి ప్రధానికి వివరించినట్లుగా మీడియాలో వచ్చింది. ఇలాంటి విషయాలు చెబుతుంటే వినేందుకు మోడీ లాంటి నేత నలబై నిమిషాలు టైం ఇస్తారనుకుంటే తప్పులో కాలేసినట్లే.

విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేసీఆర్ పాలనా తీరు.. తెలంగాణ ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు సంబంధించిన కీలకమైన సమాచారం మొత్తాన్ని ఇచ్చినట్లుగా చెబుతారు. గవర్నర్ గా వ్యవహరించిన కాలంలో నరసింహన్ ఎప్పుడూ కూడా కేసీఆర్ సర్కారు మీద ఈ తరహా రిపోర్ట్ ను ఇవ్వలేదన్న మాట వినిపిస్తోంది.

ఇందుకు భిన్నంగా ఉన్న తమిళ సై నోట్ ను మోడీ ఆసక్తికరంగా చూడటమే కాదు.. ఆమె ఇస్తున్న ఫీడ్ బ్యాక్ ను శ్రద్ధగా విన్నట్లు చెబుతున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం గురించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి నరసింహన్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ కు.. తమిళ సై ఇస్తున్న ఫీడ్ బ్యాక్ మధ్య అంతరాన్ని మోడీషాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లి గవర్నర్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసిన వైనం బయటకు పొక్కింది.

అదే సమయంలో.. గవర్నర్ తమిళసై విషయంలో ఏం చేయాలన్న దానిపైన తెలంగాణ ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ఆమె ఒక అర్థంకాని ఫజిల్ గా మారినట్లుగా తన సన్నిహితుల వద్ద కేసీఆర్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికే కాదు.. ఢిల్లీలోని పెద్దలకు సైతం నరసింహన్ కు తనకూ మధ్య తేడాను తమిళసై తన నివేదికలతో.. ఫీడ్ బ్యాక్ తో చెప్పేస్తున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News