కేసీఆర్ తో గవర్నర్ తమిళిసై ‘సై’ .!

Update: 2019-10-18 04:17 GMT
ఇన్నాళ్లు కేసీఆర్ ఆడింది ఆట.. పాడింది పాట.. మొన్నటి వరకు గవర్నర్ గా చేసిన నరసింహన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు పెద్దన్నలా అన్నింటికీ తల మద్దతుగా నిలిచేవారు. కేసీఆర్ తానా అంటా తందానా అనే టైపులో సహకరించేవారు. కానీ ఇప్పుడు వచ్చింది లేడీ సింగం.. తమిళి సై.. పైగా కేంద్రంలోని బీజేపీ అండదండలతో చేరిన ఆమె. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వేసిన ఎత్తులో తెలంగాణ గవర్నర్ గా వచ్చేశారమే.. ఇంకేముందు కొరఢా ఝలిపిస్తోంది.

కేసీఆర్ తో గవర్నర్ తమిళిసై ఢీకొంటోంది.  ప్రభుత్వంలో జరిగే సమ్మెలు - విషయాలు - ప్రభుత్వ పరమైన అంశాలపై సాధారణంగా గవర్నర్లు నేరుగా ముఖ్యమంత్రితో చర్చిస్తారు. కానీ ఈ విషయంలో తమిళిసై కేసీఆర్ కు షాకిచ్చారు. ఏకంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు నేరుగా ఫోన్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై ఆరాతీశారు. ఆర్టీసీ సమ్మెలో గవర్నర్ జోక్యం చేసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా.. కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ లా మారింది.

రవాణా మంత్రికి గవర్నర్ తమిళిసై ఫోన్ చేయడంతో ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించాడట.. తన దగ్గరకు వచ్చిన రాజకీయ పార్టీలు - ఆర్టీసీ జేఏసీ నేతల సమాచారం మేరకు మంత్రిని గట్టిగానే తమిళిసై అడిగారని తెలిసింది. గవర్నర్ ప్రశ్నలతో మంత్రి పువ్వాడ ఇబ్బంది పడినట్టుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సెల్ఫ్ డిస్మిస్ ఏంటి? కోర్టు ఆదేశాలు అమలు చేస్తున్నారా అంటూ గవర్నర్ కడిగేసినట్టు తెలిసింది. ఈ ఫోన్ రాకతో ప్రభుత్వ నుంచి సునీల్ శర్మ అనే సీనియర్ ఐఏఎస్ గవర్నర్ వద్దకు వెళ్లి సమ్మెపై వివరించారు. నివేదిక సమర్పించారట..

రాష్ట్ర పాలన వ్యవహారాలను తెలుసుకునే హక్కు గవర్నర్ కు ఉంటుంది. కానీ సాధారణ పరిపాలనలో జోక్యం చేసుకునే హక్కు మాత్రం గవర్నర్ కు ఉండదు. ఏదైనా ఉంటే సీఎంతో చర్చిస్తారు. సమాచారం తెలుసుకుంటారు.కానీ నేరుగా గవర్నర్ మంత్రి - ఐఏఎస్ లతో మాట్లాడడం తెలంగాణ రాజకీయాల్లో హీట్ ను పెంచింది. దీన్ని బట్టి కేసీఆర్ తో తమిళ సై ‘సై’ అంటున్నారని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News