రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు కేసీఆర్ స‌హా మంత్రులు మిస్‌.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై.. సీరియ‌స్‌!

Update: 2022-01-27 16:00 GMT
రిప‌బ్లిక్ డే వేడుక‌లు. ఇది అధికారిక కార్య‌క్ర‌మంగా తెలంగాణ  ప్ర‌బుత్వం నిర్వ‌మించాలి. స‌రే.. రాజ్‌భవన్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై.. ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం అధికారికంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యమంత్రి స‌హా మంత్రులకు ఆహ్వానం పంపారు. అయితే... ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన క్యాబినెట్ మొత్తం గైర్హాజ‌రైంది. ఈ ఘ‌ట‌న‌పై  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించిన‌ట్టు స‌మాచారం. ఎందుకంటే.. ఇది కేవ‌లం జాతీయ కార్య‌క్ర‌మ‌మే కాదు.. గ‌వ‌ర్న‌ర్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన అధికారిక కార్య‌క్ర‌మం కూడా.

రాజ్‌భవన్‌లో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేసే గణతంత్ర వేడుకలకు సీఎం, మంత్రులు హాజరవడం, ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగిన వేడుకలకు ప్రధాని, కేంద్ర మంత్రులు హాజరవడం అనేది సంప్ర‌దాయంగా వ‌స్తోంది. 1950లో భారతదేశం రిపబ్లిక్‌గా మారినప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ ఆచారం కొన‌సాగుతోంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ.. మంత్రులు, ముఖ్య‌మంత్రి, కీల‌క అధికారులుకూడా హాజ‌రువుతారు. జెండా వంద‌న కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్ర‌గతిని ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ నోటి నుంచిప్ర‌బుత్వాలు చెప్పిస్తుంటాయి.

2014 జూన్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 నుంచి 2021 వరకు జరిగిన ఆర్-డే వేడుకలకు కేసీఆర్,ఆయన మంత్రులు తప్పకుండా హాజరయ్యారు. కానీ కేసీఆర్ మరియు ఆయన క్యాబినెట్ మొత్తం తాజాగా జరిగిన ఆర్-డే కార్యక్రమాన్ని దాటవేశారు. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 సంవత్సరాలు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"తో జరుపుకుంటున్న తరుణంలో ఈ ఈ  కార్యక్రమం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అయితే.. తాజాగా కేసీఆర్ ఆయ‌న‌ మంత్రివర్గం ఈ ముఖ్యమైన కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాక‌పోవ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. దీనినిసీరియ‌స్‌గా తీసుకున్న గ‌వ‌ర్న‌ర్‌.. ఇది ఒక్క ఈ కార్య‌క్ర‌మాన్ని అవ‌మానించ‌డమేఏ కాకుండా.. గ‌వ‌ర్న‌ర్‌గా త‌న‌ను కూడా అవమానించారని ఆమె  భావిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ తనను 'బీజేపీ నాయకురాలిగా' భావించారని, 'రాజకీయ ప్రాతిపదికన' ఆర్‌-డే కార్యక్రమాన్ని దాటవేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశార‌ని తెలుస్తోంది. రాజ్‌భవన్‌లో ఆర్‌-డే వేడుకలకు హాజరు కావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మరికొందరు అధికారులను సీఎం పంపారు.

అయితే.. సీఎం రాలేదు. ఆయ‌న‌మంత్రి వ‌ర్గం కూడా దీనికి దూరంగా ఉంది. 'ఆరోగ్య దృష్ట్యా' కేసీఆర్‌ ఆర్‌-డేను దాటవేస్తే ఎవరి నుంచి అభ్యంతరం ఉండేది కాదు.  ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసి, అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లి అమరులైన ఆర్మీ జవాన్లకు నివాళులర్పించడంతో కేసీఆర్ చాలా ఆరోగ్యంగా ఉన్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని మాత్ర‌మే కేసీఆర్‌ ఉద్దేశ్యపూర్వకంగా ప‌క్క‌న పెట్టార‌ని.. అదే కేసీఆర్‌పై గవర్నర్‌ ఆగ్రహానికి కారణమని స్పష్టంగా రుజువైందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఈ విషయంపై కేసీఆర్, ఆయన ప్రభుత్వంపై గ‌వ‌ర్న‌ర్‌ ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని స‌మాచారం. మ‌రి దీనిపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News