కొత్త నోట్లు మళ్లీ మారుస్తార‌ట‌

Update: 2017-04-03 05:35 GMT
పెద్ద నోట్ల ర‌ద్దులో మ‌ర ప‌రిణామం. నకిలీ నోట్ల బెడదను అదుపు చేయడం కోసం ఇకపై ప్రతి మూడు నాలుగేళ్లకోసారి 2 వేలు - 500 రూపాయల నోట్ల సెక్యూరిటీ ఫీచర్లను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన చాలా దేశాలు మూడు నాలుగేళ్లకోసారి కరెన్సీ నోట్ల సెక్యూరిటీ ఫీచర్లను మారుస్తుంటాయి. నోట్ల రద్దు తర్వాత గత నాలుగైదు నెలల్లోనే పెద్ద ఎత్తున కొత్తగా విడుదల చేసిన 2 వేలు - 500 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకోవాలని యోచిస్తోంది.

గత గురువారం ఆర్థిక - హోం శాఖకు చెందిన ఉన్నతాదికారులు హాజరయిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై లోతుగా చర్చించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. హోం శాఖ అధికారులు ఈ ప్రతిపాదన చేస్తూ, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా 3-4 ఏళ్లకోసారి తమ కరెన్సీ నోట్ల సెక్యూరిటీ ఫీచర్లను మారుస్తుంటాయని, అందువల్ల మన దేశం కూడా ఇదే విధానాన్ని పాటించడం అవసరమని చెప్పారు. కాగా, పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల డిజైన్‌ను మన దేశంలో చాలా ఏళ్లుగా మార్చలేదు. నిజానికి వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసే దాకా 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన వెయ్యి రూపాయల నోటు డిజైన్‌ లో పెద్దగా మార్పు లేదు. అలాగే 1987లో ప్ర‌వేశపెట్టిన 500 రూపాయల నోటు డిజైన్‌ లో కూడా మార్పు చేసి పదేళ్లకు పైగానే అయిందని అధికారులు అంటున్నారు. ఇటీవల భారీ సంఖ్యలో పట్టుబడిన నకిలీ నోట్లను నిశితంగా పరిశీలించిన దర్యాప్తు అధికారులు కొత్త 2వేల రూపాయల నోటులో ఉండే 17 సెక్యూరిటీ ఫీచర్లలో 11 ఫీచర్లను కాపీ కొట్టినట్లు గుర్తించారు. ప్రతి మూడు నాలుగేళ్లకోసారి సెక్యూరిటీ ఫీచర్లను మార్చడం వల్ల నకిలీ నోట్లను చాలా వరకు అదుపు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

1987లో రూ.500 - 2000లో రూ.1000 నోటు ప్రవేశపెట్టిన తర్వాత గత నవంబర్ 8న మాత్రమే వాటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇటీవల జప్తు చేసిన నగదులో దొరికిన రూ.2000 విలువైన నకిలీ నోట్లు ఉన్నాయి. కొత్త రూ.2000 నోటుపై ముద్రించిన 17 భద్రతా ఫీచర్లలో కనీసం 11 ఫీచర్లు నకిలీ నోట్లపై ఉన్నాయని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. వాటర్‌ మార్క్ - అశోక చక్రం - ఎడమవైపున రూ.2000ను తెలిపే అంకెలు, ఆర్బీఐ గవర్నర్ సంతకంతోపాటు హామీ నిబంధన, దేవనగరి భాషలో నోటు విలువ కూడా నకిలీవే అయినా నిజమైన నోట్లలో కలిసిపోయాయని, చంద్రయాన్ నేపథ్యంతోపాటు స్వచ్ఛ భారత్ లోగో కూడా యథాతథంగా ముద్రించారని, వాటి నాణ్యత చాలా నాసిరకంగా ఉన్నదని దర్యాప్తు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ ఐ సాయంతో ముద్రించిన నకిలీ నోట్లను బంగ్లాదేశ్ ద్వారా దేశంలోకి అక్రమ రవాణా చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు. 2016లో కోల్‌ కతాలోని భారతీయ గణాంకాల సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం రూ.400 కోట్ల నకిలీ నగదు దేశంలో చలామణిలో ఉందని తేలింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News