దేశ చ‌రిత్ర‌లో కీల‌క‌మైన 50 నిమిషాలు ఇలా..

Update: 2017-07-01 05:23 GMT
దేశ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం మొద‌లైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జీఎస్టీ వ‌చ్చేసింది. దేశ ప‌న్నుల విధానంలో కీల‌క మ‌లుపు తిప్పేస్తుంద‌న్న అంచ‌నాలున్న జీఎస్టీ జ‌న జీవితాల్లోకి వ‌చ్చేసింది. యావ‌త్ దేశ ప్ర‌జ‌ల్ని ప్ర‌భావితం చేసే ఈ వ‌స్తుసేవ‌ల బిల్లు అధికారికంగా అమ‌ల్లోకి రావ‌టానికి ముందు 50 నిమిషాలు.. చారిత్ర‌క పార్ల‌మెంట్ భ‌వ‌నంలో వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. అవెలా సాగాయ‌న్న‌ది చూస్తే..

జీఎస్టీ అమ‌లు నేప‌థ్యంలో పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ముందు ఏమేం జ‌రిగింద‌న్న‌ది చూస్తే..

+ శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో అతిధుల రాక మొద‌లైంది.

+ చిరు జ‌ల్లులు ప‌డుతున్న వేళ‌.. రాత్రి 10.36గంట‌లకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పార్ల‌మెంటుకు వ‌చ్చారు

+ మోడీ వ‌చ్చే స‌మ‌యానికే ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ.. లోక్ స‌భా స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ వ‌చ్చి  ఉన్నారు.

+ మోడీ వ‌చ్చిన త‌ర్వాత పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ లోకి వెళ్ల‌లేదు. ముఖ్య అతిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు

+ రాత్రి 10.56 గంట‌ల‌కు స‌మ‌యంలో ఉప రాష్ట్రప‌తి అన్సారీ వ‌చ్చారు. వీరంతా రాష్ట్రప‌తి రాక కోసం వెయిట్ చేశారు

+ రాత్రి 10.59 గంట‌ల‌కు రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ వ‌చ్చారు. ఆయ‌న‌కు అనంత్ కుమార్ స్వాగ‌తం ప‌లికారు.

+ ఉప‌రాష్ట్రప‌తి.. ప్రధాని.. స్పీక‌ర్‌.. త‌దిత‌రులంతా క‌లిసి ఆయ‌న్ను ద‌గ్గ‌రుండి సెంట్ర‌ల్ హాల్ లోప‌ల‌కు తీసుకెళ్లారు.

+ వేదిక పైకి వ‌చ్చిన రాష్ట్రప‌తి.. ప్ర‌ధానుల‌కు జైట్లీ ఒక్కో గులాబీ ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు.

+ 11.03 గంట‌ల‌కు జాతీయ గీతాలాప‌న‌తో కార్య‌క్ర‌మం మొద‌లైంది.

+ గీతాలాప‌న ముగిశాక‌.. అంద‌రూ భార‌త్ మాతాకీ జై అని నిన‌దించారు.

+ స‌భాధ్య‌క్ష స్థానంలో రాష్ట్రప‌తి.. ఆయ‌న‌కు కుడివైపున ఉప‌రాష్ట్రప‌తి.. స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌.. జైట్లీ.. ఎడ‌మ‌వైపున ప్ర‌ధాని మోడీ.. ఆయ‌న ప‌క్క‌న మాజీ ప్ర‌ధాని దేవెగౌడ ఆశీనుల‌య్యారు. పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ లో వేదిక‌పై రాష్ట్రప‌తి ప‌క్క‌న ప్ర‌ధాని కూర్చోవ‌టం ఇదే తొలిసారి కావ‌టం గ‌మ‌నార్హం.

+ జైట్లీ ప్ర‌సంగం త‌ర్వాత ప్ర‌ధాని మోడీ మాట్లాడారు.

+ 11.49 గంట‌ల‌కు ప్ర‌ధాని ప్ర‌సంగం ముగిసింది.

+ జీఎస్టీ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి సంబంధించి లోక్ స‌భ టీవీ ప్రారంభించిన కౌంట్ డౌన్ 12 గంట‌ల‌కు ముగిసిన త‌ర్వాత దాదాపు నిమిషం పాటు రాష్ట్రప‌తి ప్ర‌సంగం కొన‌సాగింది.

+ రాష్ట్రప‌తి ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే.. ఆయ‌న ముందు ఒక బాక్స్‌ను తెచ్చి పెట్టారు. ప్ర‌ణ‌బ్‌.. మోడీ లేచి నిల‌బ‌డి బాక్స్ మీద ఉన్న బ‌ట‌న్ పైన ఉన్న మీట‌ను నొక్కిన వెంట‌నే అది వెలిగింది. అంతే.. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారంతా బ‌ల్ల‌లు చ‌ర‌చి త‌మ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దేశంలోకి కొత్త ప‌న్నుల విధానం అధికారికంగా అమ‌ల్లోకి వ‌చ్చేసిన‌ట్లైంది.

+ ఆ వెంట‌నే జాతీయ గీతాలాప‌న‌తో కార్య‌క్ర‌మాన్ని ముగించి అంద‌రూ వెళ్లిపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News