అక్కడే గుడివాడ గురి : అనకాపల్లి సీటు వదిలేస్తారా...?

Update: 2022-08-03 03:55 GMT
ఉమ్మడి విశాఖ జిల్లాలో అధికార వైసీపీ రాజకీయం మారుతోంది. అధినాయకత్వం ఒక వైపు గెలుపు గుర్రాల కోసం ఇప్పటి నుంచే వేట మొదలెట్టేసింది. తప్పకుండా గెలవాలి. జనంలో ఉండాలి. వారికే టికెట్లు అని అధినాయకుడు జగన్ క్లారిటీగా చెప్పేశాక ఎవరికీ తమ టికెట్ మీద గ్యారంటీ అయితే లేదు. ఈ నేపధ్యంలో ఒకరి సీటు మీద మరొకరి కన్ను పడుతోంది.

అలాగే ఎంపీలు అసెంబ్లీ బరిలోకి వస్తూంటే కొత్తవారు కూడా ఏదో ఒక టికెట్ అంటూ పావులు కదుపుతున్నారు. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే, యువ మంత్రి అయిన గుడివాడ అమరనాధ్ ఈసారి అక్కడ నుంచి పోటీ చేయరని వార్తలు వస్తున్నాయి. గుడివాడ 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి జగన్ వేవ్ లో గెలిచారు. ఆయనకు ఆనాడు అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు లాంటి వారి మద్దతు కూడా దక్కింది.

అయితే ఇపుడు దాడి బాహాటంగానే గుడివాడను వ్యతిరేకిస్తున్నారు. అంతే కాదు బలమైన ఒక సామాజికవర్గం కూడా గుడివాడ అంటే మండుతోంది అని టాక్. ఇవన్నీ ఇలా ఉంటే నాన్ లోకల్ ట్యాగ్ కూడా ఆయనకు పెట్టి మరీ ఈసారి ఓడించడానికి సొంత పార్టీ వారే రెడీ అవుతున్నారు అని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో గుడివాడ తన సీటూ ఫేటూ రెండూ వేరే చోట వెతుక్కునే పనిలో పడ్డారని అంటున్నారు.

ఆయన తన తండ్రి తాతలు  ఒకనాడు పోటీ చేసి గెలిచిన పెందుర్తి సీటు మీద కన్నేశారని టాక్. అక్కడ పోటీ చేస్తే తనకు లోకల్ కార్డ్ తో పాటు తన బలమైన రాజకీయ వారసత్వం కూడా నిలుస్తుంది అని కూడా భావిస్తున్నారుట. ఇక అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అదీప్ రాజ్ ఉన్నారు. ఈయన మరోసారి టికెట్ తనకే దక్కాలని పట్టుబడుతున్నారు. గుడివాడను అన్నయ్యా అంటూ ఆయనకు బలమైన‌ మద్దతుదారుగా ఉంటారు.

అయితే సడెన్ గా అదే మంత్రి తన సీటు మీద కన్నేయడంతో అదీప్ రాజ్ జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు. అయితే పెందుర్తిలో కాపులు, వెలమల బలం ఎక్కువ. అదీప్ వెలమ సామాజికవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. గుడివాడ కాపు కార్డుతో ఈ సీటులో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు. గుడివాడ కన్నేశారు కాబట్టి ఆయనకు ఇవ్వడానికి హై కమాండ్ కూడా మొగ్గు చూపుతుంది అని అంటున్నారు.

ఎందుకంటే జగన్ కి గుడివాడ అంటే ప్రత్యేక అభిమానం. పైగా అదీప్ రాజ్ కమాండ్ చూపించలేకపోతున్నారు అని అంటున్నారు. మొత్తానికి గుడివాడ గురితో అదీప్ జాతకం తారుమారు అవుతుందా అని ఆయన అనుచరులు మధనపడుతున్నారుట.
Tags:    

Similar News