పవన్ ను తిట్టాలంటే ఈ పోలిక అవసరమా అమర్ నాథ్?

Update: 2022-11-02 04:30 GMT
మోతాడుకు మించింది ఏదైనా లాభం కంటే నష్టాన్నే కలిగిస్తుందన్న ప్రాథమిక విషయాన్ని ఏపీ అధికారపక్ష నేతలు మర్చిపోతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారుతోంది. తమకురాజకీయ ప్రత్యర్థి అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి.. అధికార పార్టీ నేతలు నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం.. ఎంత మాటనైనా ఇట్టే అనేయటం ఆ పార్టీని అమితంగా ఆరాధించే హార్డ్ కోర్ అభిమానులకు ఓకే అయినా.. అలాంటి తీరు జనసామ్యానికి మరోలా అర్థమవుతుందన్న విషయాన్ని మిస్ అవుతున్నారన్న మాట వినిపిస్తోంది.

జనసేన అధినేత పవన్ కారణంగా తమ చేతిలో ఉన్న అధికారం ఎక్కడ చేజారిపోతుందన్న భయం వైసీపీ నేతల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెప్పక తప్పదు. అదే నిజం కాకుంటే.. పవన్ ను పట్టించుకునే వారే కాదన్నది వాస్తవం. 2019లో మాదిరి పవన్ ను ఒంటరిగా పోటీ చేసేలా చేస్తే..  తమ వ్యతిరేక ఓటును చీల్చటంతో పాటు.. త్రిముఖ పోటీలో ముందు ఉంటామన్న ఆలోచన వారిలో ఉంది. అందుకు భిన్నంగా.. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చనివ్వను అంటూ పవన్ విస్పష్టంగా ప్రకటన చేస్తున్న వేళ.. అధికార పార్టీ నేతల మొదటి లక్ష్యంగా పవన్ మారారు.

ఆయన్ను దెబ్బ తీయటం కోసం.. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసందేుకు చేస్తున్న పరయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే ఆయన్ను ప్యాకేజీ స్టార్ అని.. మూడు పెళ్లిళ్లు అంటూ ఎటకారపు వ్యాఖ్యలు చేయటం బాగానే ఉన్నా.. ప్యాకేజీ స్టార్ అన్న మాటకు ఇప్పటివరకు సరైన సాక్ష్యాన్ని.. ఆధారాన్ని చూపించలేదు. ఇప్పుడు దత్తపుత్రుడు పేరుతో ఆయన ఇమేజ్ ను ధ్వంసం చేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది.

గతంలో తన కారణంగా జరిగిన పొరపాట్లను అర్థం చేసుకున్న పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు మంట పుట్టేలా వ్యవహరిస్తున్నారు. దీంతో.. ఆయన్ను టార్గెట్ చేయటం తమ మొదటి పనిగా చేసుకున్నారు. ఇందులో భాగంగా తమకు తోచిన ఏదో ఒక మాటను చెప్పేస్తూ.. వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తీరుతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందంటున్నారు. తాజాగా ఏపీ రాష్ట్ర పరిశ్రమలు.. ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ.. ఏపీలో కేఏ పాల్ 175 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారని.. అదే రీతిలో పవన్ కూడా 175 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేయటం గమనార్హం.

జనసేన కార్యకర్తలు పవన్ ను సీఎంగా చూడాలని కోరుకుంటుంటే.. ఆయన మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు జనసైనికుల బానిసలుగా బతకాలన్న అమర్ నాథ్ మాటలు చూస్తే.. కేఏ పాల్ మాదిరి గానో.. వైసీపీ నేతలు కోరుకున్నారని.. పవన్ తన రాజకీయాల్ని మార్చుకోవాలా? అన్న సందేహం కలుగక మానదు.

పవన్ మీద అంత ప్రేమే ఉంటే.. గుడివాడ అమర్ నాథ్ లాంటోళ్లు వైసీపీకి రాజీనామా చేసి.. జనసేన కార్యకర్తలు కోరుకున్న రీతిలో.. పవన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు జనసేన తీర్థం పుచ్చుకొని.. వారి కార్యకర్తల మనోభావాల్ని రక్షించేందుకు పవన్ మీద పోరాడేలా కానీ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటమా? అన్న ప్రశ్నలు పలువురి నోటి నుంచి వినిపిస్తున్నాయి. అయినా.. పవన్ ఎలాంటి రాజకీయం చేస్తే అమర్ నాథ్ కు ఎందుకు? కేఏ పాల్ తో పవన్ ను పోల్చటం ద్వారా ఆయన కోరుకుంటున్నది ఏమిటన్నది ఏపీ ప్రజలు అర్థం చేసుకోగలరు. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావించి.. పవన్ ను చిన్నబుచ్చలనే వైఖరి.. ఆయనకే నష్టం కలిగిస్తుందన్న విషయం అమర నాథ్ మాస్టారికి ఎప్పటికి అర్థమవుతుందో?





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News