మోడీ ఇలాకాలో రైతుల‌పై లాఠీ చార్జ్‌

Update: 2017-02-15 08:25 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ లో రైత‌న్న‌ల‌పై లాఠీ విరిగింది. గుజ‌రాత్‌ లోని సనంద్‌ పట్టణంలో అన్నదాతలు చేపట్టిన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులకు పోలీసులకు మధ్య తలెత్తిన ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. సాగునీటి కొరత సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు నల్‌ సరోవర్‌ పరిసరాలకు చెందిన దాదాపు మూడు వేల మంది రైతులు పెద్ద ఎత్తున గాంధీనగర్‌ వరకూ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

నిర‌స‌న‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ రైతులు పెద్ద సంఖ్య లో గాంధీనగర్‌ వైపు దూసుకువెళ్తుండగా వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారే కాకుండా బాష్పవాయును సైతం ప్రయోగించారు. అయిన‌ప్ప‌టికీ ఉపయోగం లేకపోయింది. ముందుకు సాగడానికే నిర్ణయించుకున్న రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘర్షణలో 15 మందిని అదుపులోకి తీసుకున్నామని వారిపై ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేస్తామని ఎస్‌ పీ చెప్పారు. అయితే ఈ సంఘటనపై స్పందించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు - పటేల్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ పోలీసుల తీరును తప్పుపట్టారు. శాంతియుతంగా సాగుతున్న ర్యాలీపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ల నోళ్లు మూయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్  చేశారు. సహేతుకమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న రైతన్నలపై దాడి చేయడం ద్వారా అధికార పీఠాన్ని కాపాడుకోవాలన్న బీజేపీ పాలకుల దురాలోచన స్పష్టమవుతోందని హార్దిక్‌ విమర్శించారు. ఈ చ‌ర్య‌లు బీజేపీ ప్ర‌భుత్వ నిరంకుశ దోర‌ణికి అద్దం ప‌డుతోంద‌ని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News