వైసీపీ మంత్రికి గుంటూరు కోర్టు షాక్‌.. కేసు నమోదుకు ఆదేశం!

Update: 2023-01-11 08:19 GMT
ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన పార్టీలు, ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లపై నిత్యం విమర్శలు చేస్తుండే వైసీపీ మంత్రుల్లో అంబటి రాంబాబు ఒకరు. ఈ వాగ్దాటి అంబటికి వైఎస్‌ జగన్‌ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కీలకమైన జలవనరుల మంత్రిత్వ శాఖ లభించడానికి కారణమైంది.

కాగా ప్రస్తుతం గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు ఉన్నారు. ఈ క్రమంలో గుంటూరు కోర్టు మంత్రి అంబటి రాంబాబుకు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆయనపై కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అంబటి రాంబాబు నేతృత్వంలో 'వైఎస్సార్‌ సంక్రాంతి లక్కీ డ్రా' పేరుతో సత్తెనపల్లిలో వైసీపీ నేతలు లాటరీ టికెట్లు అమ్ముతున్నారని జనసేన పార్టీ నేతలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో లాటరీ టికెట్లపై నిషేధం ఉందని.. దీన్ని ఉల్లంఘించి మంత్రి తన సహచరులతో లాటరీ టికెట్లు అమ్మిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జనసేన పార్టీ నేతల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు కోర్టులో జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై విచారణ జరిపిన కోర్టు.. మంత్రి అంబటిపై తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆయనపై విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది.

కాగా ఇటీవల కూడా మంత్రి అంబటి రాంబాబు ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఒక మృతుడి కుటుంబానికి వచ్చిన నష్ట పరిహారంలో తనకు రెండు లక్షలు రూపాయలు చెల్లించాల్సిందేనని అంబటి డిమాండ్‌ చేశారని మృతుడి కుటుంబం ఆరోపించింది.

మరోవైపు ఈ వ్యవహారాన్ని అంబటి రాంబాబు ఖండించారు. తనపై జనసేన నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ఇటీవల పవన్, చంద్రబాబు భేటీపైన సైతం అంబటి సంచలన ట్వీట్‌ చేశారు. దీనిపైన జనసేన నేతలు అంబటిపై ధ్వజమెత్తారు.

ఈ నేపథ్యంలో గుంటూరు కోర్టు అంబటిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News