మిర్చి పాపం వారిదేన‌ని తేల్చిన హ‌రీశ్‌

Update: 2017-05-05 04:12 GMT
మంచి మాట‌కారి అయిన తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్‌.. త‌న‌కున్న చాతుర్యాన్ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. గిట్టుబాటు ధ‌ర లేక  కిందామీదా ప‌డుతున్న మిర్చి రైతులు.. క‌డుపుమండి తీవ్రస్థాయిలో చేస్తున్న ఆందోళ‌న‌ల‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు ఎంత‌గా ఇబ్బంది ప‌డుతున్నాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. మిర్చి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు కార‌ణం తామే మాత్రం కార‌ణం కాద‌ని తేల్చి చెప్ప‌ట‌మే కాదు.. ఈ పాపం మొత్తం వారిదేనంటూ హ‌రీశ్ వినిపిస్తున్న వాద‌న ఆస‌క్తిక‌రంగా మారింది.అంతేకాదు.. మిర్చి పంట‌కు క్వింటాలు రూ.5వేల మ‌ద్ద‌తు ధ‌ర‌ను ప్ర‌క‌టించిన కేంద్రంపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన హ‌రీశ్‌.. కేంద్రం తీరుపై ఫైర్ అయ్యారు.

మిర్చి పంట కొనుగోలుపై కేంద్రం చేసిన ప్ర‌క‌ట‌న‌ను మిలీనియం జోక్ అని తేల్చేసిన ఆయ‌న‌.. 33వేల ట‌న్నుల మిర్చిని తాము ఒక‌ట్రెండు రోజుల్లోనే కొనేస్తామ‌ని.. మ‌రి మిగిలిన పంట మాటేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ‌లో 70 ల‌క్ష‌ల క్వింటాళ్ల మిర్చి పండింద‌ని.. అన్ని ర‌కాల మిర్చితో పాటు తాలు ర‌కాన్ని ఎవ‌రు కొంటారంటూ ప్ర‌శ్నించారు. కేంద్రం చేసిన ప్ర‌క‌ట‌న రైతుల‌కు శ‌ఠ‌గోపం పెట్టేలా ఉంద‌న్న హ‌రీశ్‌.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు తీరును తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టారు.

మేలుర‌కం మిర్చికి మార్కెట్లో రూ.6వేల ధ‌ర ప‌లుకుతోంద‌ని.. కానీ కేంద్రం మాత్రం రూ.5వేల‌కే కొనాలంటూ ధ‌ర‌ను త‌గ్గించిందంటూ త‌ప్పుప‌ట్టిన హ‌రీశ్‌.. మిర్చి రైతుల స‌మ‌స్య‌ల్ని కేంద్రం స‌రిగా ప‌ట్టించుకోలేద‌న్నారు. మిర్చి క్వింటాళ్ల‌కు రూ.7వేల చొప్పున చెల్లించాలంటూ మార్చి 11న‌.. ఏప్రిల్ 1న తాము కేంద్రానికి లేఖ రాశామ‌ని.. దొంగ‌లు ప‌డిన ఆర్నెల్ల‌కు కుక్క‌లు ప‌డిన రీతిలో కేంద్రం తీరిగ్గా మేలో స్పందించింద‌న్న హ‌రీశ్‌.. మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించ‌టం కేంద్రం ప‌రిధిలోని అంశ‌మ‌ని.. ఇంత‌కాలం  మ‌ద్ద‌తు ధ‌ర లేక‌పోవ‌ట‌మే ఈ స‌మ‌స్య‌కు కార‌ణంగా తేల్చారు.

అంతేనా.. మిర్చి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల పాపం దేవాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌.. ప‌దేళ్లు పాలించిన ఎన్డీయే ప్ర‌భుత్వాల‌ది కాదా? అంటూ.. ఇంత‌కాలం మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర ఎందుకు నిర్ణ‌యించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. మొత్తంగా త‌మ త‌ప్పు ఎంత‌మాత్రం లేద‌న్న విష‌యాన్ని హ‌రీశ్ నొక్కి వ‌క్కాణించిన వైనం చూస్తే.. మిర్చి రైతుల వెత‌ల‌కు తామే మాత్రం కార‌ణం కాద‌న్నట్లుగా క‌నిపిస్తుంది. స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు కార‌ణం ఎవ‌రో ఒక‌రి మీద నెట్టేయటం..అన్ని బాగున్న‌ప్పుడు ఆ క్రెడిట్ అంతా త‌మ‌దేన‌ని చెప్పుకోవ‌టం ఏమాత్రం బాగోలేద‌న్న మాట వినిపిస్తోంది. కేంద్రం అంతా చూసుకొని.. మిర్చి రైతుకు ఏ మాత్రం క‌ష్టం లేకుండా ఉండేలా చూసుకుంటే.. ఇప్పుడిన్ని మాట‌లు అంటున్న హ‌రీశ్‌.. రైతు ముఖం మీద న‌వ్వుకు కార‌ణం కేంద్ర‌మ‌ని ప్ర‌శంసించేవారా? అన్న‌ది ప్ర‌శ్న‌.

రైతు క‌ష్టంలో ఉన్న‌ప్పుడు.. తామేం చేయాల‌న్న అంశం మీద దృష్టి పెట్టాలే కానీ.. నెపాన్ని వేరే వారి మీద వేసేసి చేతులు దులుపుకుంటే స‌రిపోతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. కేంద్రానికి రెండుసార్లు లేఖ రాయ‌టంతోనే తెలంగాణ రాష్ట్రం ప‌ని అయిపోయిందా? అన్న‌ది మ‌రో సందేహం. రెండు లేఖ‌లు రాసిన కొన్ని రోజుల త‌ర్వాత అయినా కేంద్రం స్పందించి.. అర‌కొర ధ‌ర‌నుఅయినా ప్ర‌క‌టించింది. మ‌రి.. రోడ్ల మీద‌కు వ‌చ్చి తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్న రైతుల బాధ‌ను అర్థం చేసుకొని సాంత్వ‌న క‌లిగేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క మాట అయినా ఎందుకు మాట్లాడ‌లేద‌న్న‌ది ప్ర‌శ్న‌. మ‌రి.. దీనికి హ‌రీశ్ ఏం స‌మాధానం చెబుతారు? త‌ప్పుల్ని ఎత్తి చూపొద్ద‌ని చెప్ప‌టం లేదు. కానీ.. అందులో తమ బాధ్య‌త ఎంతోకొంత ఉంటుంద‌న్న విష‌యాన్ని వ‌దిలేసి.. తిట్ల పురాణంతో ఇష్యూను రాజ‌కీయం చేసే క‌న్నా.. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మీద హ‌రీశ్ లాంటి వారు ఫోక‌స్ చేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News