హెచ్ సీయూ వీసీ ఇంటిపై దాడి..ఇదీ భావస్వేచ్ఛేనా?

Update: 2016-03-22 06:49 GMT
దేశవ్యాప్తంగా చర్చగా మారి.. పెద్ద రచ్చకే దారి తీసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో కొంతకాలం రగిలిపోయిన హెచ్ సీయూ ఈ మధ్యనే కాస్తంత ప్రశాంతంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటంతో పాటు.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం గమనార్హం.

రోహిత్ ఆత్మహత్యకు కారణం వీసీ అప్పారావు అంటూ ఆరోపణలు వెల్లువెత్తిన ఆయన.. సెలవుపై వెళ్లటం తెలిసిందే. తాజాగా ఆయన తిరిగి వీసీ బాధ్యతలు చేపట్టేందుకు రావటం కొందరు విద్యార్థుల్లో ఆందోళనకు కారణమైంది. ప్రస్తుతం ఇన్ ఛార్జ్ వీసీగా వ్యవహరిస్తున్న పెరియాస్వామి నుంచి బాధ్యతలు తీసుకున్న వీసీ అప్పారావుపై హెచ్ సీయూకు చెందిన కొందరు విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. ఆందోళనకు దిగారు.

ఆందోళనలు హద్దులు దాటి వీసీ బంగ్లా మీదకు దాడికి దిగి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వీసీగా అప్పారావును ఒప్పుకునే ప్రసక్తే లేదని వారు నిరసన చేపట్టారు. మరోవైపు ఈ ఇష్యూలో ఏబీవీపీ సంఘానికి చెందిన విద్యార్థులు వీసీకి దన్నుగా నిలిచారని చెబుతున్నారు. తాజాగా పరిణామాలు హెచ్ సీయూలో తీవ్ర ఉద్రిక్తతకు కారణంగా మారాయి. వీసీగా అప్పారావు బాధ్యతలు తీసుకోవటంపై అభ్యంతరం ఉంటే ఆందోళన చేయటంలో తప్పు లేదు. కానీ.. అందుకు భిన్నంగా ఆయన నివాసంలోకి దూసుకుపోయి దాడి చేయటం.. ఫర్నీచర్ ధ్వంసం చేయటం ఏమిటి? అన్నది ప్రశ్న.

ఏబీవీపీ గూండాలు తమపై దాడి చేస్తున్నట్లుగా కొందరు విద్యార్థులు విమర్శలు చేస్తున్నారు. వీసీకి దన్నుగా ఉంటూ వారు తమపై దాడి చేస్తున్న విద్యార్థుల వాదనఒకవైపు వినిపిస్తుంటే.. మరోవైపు వీసీ అధికారిక  నివాసంలో ఫర్నీచర్ మొత్తం దాడికి గురై ధ్వంసం కావటం కనిపిస్తోంది. భావస్వేచ్ఛను ఎవరూ కాదనలేరు. కానీ.. ఆ పేరుతో ఇళ్లపై దాడులు చేసి.. ఫర్నీచర్ ధ్వంసం కూడా చేయొచ్చా..?
Tags:    

Similar News