జకోవిచ్ ఆడతారా? లేదా? అతడి ఫ్యూచర్ తేల్చేది అతనేనట!

Update: 2022-01-14 04:50 GMT
ఏ దేశానికి అయితే వెళతామో.. ఆ దేశ నిబంధనల్ని తూచా తప్పకుండా ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని దేశాల్లో సెలబ్రిటీలు.. ప్రముఖులు.. ఆయా రంగాల్లో దిగ్గజాలు అన్నంతనే.. వారి విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది. కానీ.. అందుకు భిన్నంగా మరికొన్ని దేశాలు ఉంటాయి. రూల్ బుక్ అంటే రూల్ బుక్ ను పక్కాగా ఫాలో చేయటం వారిలో కనిపిస్తుంది. అవతలోడు ఎంత ప్రముఖుడైనా కావొచ్చు.. సెలబ్రిటీఅయినా కావొచ్చు. రూల్ ప్రకారం లేకుంటే వారి విషయంలో చర్యలు తీసుకోవటానికైనా వెనుకాడరు.

అలాంటి దేశాల్లో ఒకటి ఆస్ట్రేలియా. ఈ నెల 17న మొదలయ్యే ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆడేందుకు సెర్బియన్ ఆటగాడు కమ్.. నెంబర్ వన్ టెన్నిస్ స్టార్ కమ్ డిఫెండింగ్ చాంఫియన్ జొకోవిచ్ ఈ టోర్నీలో ఆడతాడా? లేదా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే.. దీనికి నిర్వాహకులు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆస్ట్రేలియాకు వచ్చే వారు ఎవరైనా సరే.. రెండు డోసులు కరోనా టీకాను వేసుకొని రావాల్సి ఉంటుంది. ఒకవేళ.. అలా చేయని పక్షంలో అందుకు కారణం ఏమిటి? అన్న విషయం ఆస్ట్రేలియా చట్టాలు ఆమోదించే పత్రాలతో రావాల్సి ఉంటుంది.

జకోవిచ్ విషయంలో అలా జరగలేదు. దీంతో.. అతడ్నివిమానాశ్రయంలోనే నిలిపేయటంతో ప్రపంచ వ్యాప్తంగా ఇదో హాట్ టాపిక్ గా మారింది. చివరకు సెర్బియా ప్రధాని సైతం సీన్లోకి వచ్చినా.. రూల్ అంటే రూల్. దాన్ని బ్రేక్ చేయలేం.. మా దేశ ప్రజల భద్రత మాకు చాలా ముఖ్యమంటూ తేల్చేయటంతో.. ఏమీ చేయలేని పరిస్థితి. జకోవిచ్ కు సెర్బియా దేశ ప్రజలంతా అండగా ఉన్నారన్న మాటను మాత్రం ఆ దేశ ప్రధాని చెప్పారు.

జకోవిచ్ రెండు టీకాలు వేసుకోకపోవటం.. అందుకు అవసరమైన మినహాయింపుల్లో సహేతుక లేదన్న కారణాన్ని ఎత్తి చూపిన సరిహద్దు భద్రతా దళం అతన్ని దేశంలోపలకు అనుమతించలేదు. అతడి వీసాను రద్దు చేసి.. అతడ్ని ఒక హోటల్ కు తరలించి.. అక్కడే ఉంచింది. దీంతో.. ఈ అంశంపై కోర్టుకు వెళ్లిన జకోవిచ్.. అక్కడ విజయం సాధించారు. హోటల్ నుంచి బయటకు వచ్చి ప్రాక్టీస్ చేస్తుననారు. అయితే.. అతడి వీసాను తనకున్న వ్యక్తిగత విచక్షాణాధికారంతో రద్దు చేసే విషయాన్ని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖా మంత్రి అలెక్స్ హాక్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

దీంతో జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో ఆడతారా? లేదా? అన్న దానిపై కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. ఇంతకీ రద్దుచేసి.. అతడి వీసాను టోర్నీ ఆడేలా పునరుద్దరిస్తారా? లేదంటే.. రద్దు చేసి తిరిగి పంపేస్తారా? అన్నది మాత్రం తేల్లేదు. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ మాట్లాడుతూ.. జకోవిచ్ వీసా విషయంలో వ్యక్తిగత రద్దు నిర్ణయాన్ని తీసుకునే అధికారం అలెక్స్ కు ఉందని.. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తాను మాట్లాడనని పేర్కొనటం గమనార్హం.

డిసెంబరు 16న తనకు కరోనా సోకినట్లుగా వెల్లడించిన జకోవిచ్.. ఆ తర్వాత బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాకు రావటానికి రెండు వారాల వ్యవధిలో తన ప్రయాణ వివరాలపై తన సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా జకోవిచ్ చెప్పటం గమనార్హం.

జకోవిచ్ రెండు డోసులు వేసుకోలేదు కాబట్టి.. అతడు ఆస్ట్రేలియా నుంచి వెళ్లిపోవాలని ఆస్ట్రేలియన్లు కోరుతున్నారు. ఇదిలా ఉంటే..మరోవైపు ఆట విషయానికివస్తే.. ఈ టోర్నీకి సంబంధించిన డ్రా ప్రకారం జకోవిచ్ తన తొలి మ్యాచ్ ను తమ దేశానికి చెరందిన ప్రపంచ 78వ ర్యాంకర్ కెక్ మనోవిచ్ తో పోటీ పడాల్సి ఉంటుంది. టోర్నీ మొదలయ్యే లోపు.. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా.. జకో టోర్నీలో పాల్గొంటారా? లేదా? అన్నది తేలనుంది.
Tags:    

Similar News