ఒక వైన్‌షాప్‌ కోసం 300 మంది పోటీ

Update: 2015-06-28 04:14 GMT
ఒక వైన్‌షాప్‌ కోసం ఎంత మంది పోటీ పడతారు? మహా అయితే పది లేదంటే పాతిక. ఎందుకంటే.. ఒక వైన్‌షాప్‌కి పోటీపడే వారంతా ఆయా సిండికేట్లే అన్నది బహిరంగ రహస్యం. ఇలాంటి సిండికేట్లు తమ మధ్య అనవసర పోటీ తప్పించటానికి ముందస్తుగా ఒప్పందాలు చేసుకోవటం మామూలే.

అయితే.. ఇలాంటి సిండికేట్ల చూపులన్నీ ఒక్క వైన్‌ షాప్‌ మీద దృష్టి సారించాయి. ఏపీలో తాజాగా జరుగుతున్న మద్యం షాపుల రెండేళ్ల లైసెన్స్‌ కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఏ ఊరిలో కూడా లేనంత డిమాండ్‌ ఒకే ఒక్క ఊరిలో ఉండటం ఇప్పుడు అందరి దృష్టి అటువైపు మళ్లుతోంది.

గుంటూరు జిల్లాలోని గురజాల.. పిడుగురాళ్ల మధ్యన ఉన్న నడికూడి ఊరిలో నిబంధనల ప్రకారం ఒకే ఒక్క మద్యం షాపును ఏర్పాటు చేసే వీలుంది. అయితే.. సికింద్రాబాద్‌ వెళ్లే రైలుమార్గంతోపాటు.. నేషనల్‌ హైవేకి ఈ ఊరు అత్యంత కీలకమైంది. ఈ ఊరు గుండా పెద్దఎత్తున వాహనాలు వెళుతుంటాయి.

అందుకే.. రికార్డు స్థాయిలో ఈ ఊరిలో ఏర్పాటు చేసే మద్యం దుకాణం కోసం పోటీ పడుతున్నారు. ఏపీ రాష్ట్రం మొత్తం మీదా ఎక్కడా లేని విధంగా ఏకంగా 300 మంది మద్యం దుకాణం ఏర్పాటు చేయటం కోసం దరఖాస్తు దాఖలు చేసుకున్నారు. మరి.. బంపర్‌ ఆఫర్‌ ఎవరికి దక్కుతుందో..?

Tags:    

Similar News